ఇతరుల జోక్యాన్ని సహించేది లేదు.. ఇరాన్ మాస్ వార్నింగ్

by Malleboina Mahesh |

హర్మూజ్ జలసంధి వ్యవహారంలో ఇతర దేశాల జోక్యాన్ని సహించబోమన్న ఇరాన్.. అతిక్రమిస్తే పశ్చిమాసియాలో సమస్యలు తీవ్రతరమవుతాయని హెచ్చరిక!

ఇతరుల జోక్యాన్ని సహించేది లేదు.. ఇరాన్ మాస్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన, వ్యూహాత్మకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) వ్యవహారాల్లో బాహ్య శక్తుల ప్రమేయాన్ని తాము ఎంతమాత్రం సహించబోమని ఇరాన్ ప్రభుత్వం తీవ్రస్థాయిలో హెచ్చరించింది. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ సంచలన ప్రకటన విడుదల చేసింది. హర్మూజ్ జలసంధి పరిధిలో భద్రతను పర్యవేక్షించే పూర్తి హక్కు, బాధ్యత తమకే ఉన్నాయని, ఇక్కడ ఇతర దేశాలు గనుక జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ప్రాంతీయ సమస్యలు మరింత తీవ్రతరమవుతాయని (Escalate the Crisis) స్పష్టం చేసింది.

ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు ఐదింట ఒక వంతు వాటా ఈ హర్మూజ్ జలసంధి ద్వారానే సాగుతుంది. ఈ నేపథ్యంలో అమెరికా, దాని మిత్రదేశాల నౌకాదళాల కదలికలను ఉద్దేశించి ఇరాన్ ఈ వ్యాఖ్యలు చేసింది. తమ ప్రాంతీయ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే ఎంతటి కఠిన నిర్ణయాలకైనా వెనుకాడబోమని ఇరాన్ సైనిక వర్గాలు తెలిపాయి. బాహ్య శక్తుల ప్రమేయం వల్ల ఈ ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం కలగడమే కాకుండా, అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌పై కూడా అది తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. పశ్చిమాసియా ప్రయోజనాల దృష్ట్యా ఇతర దేశాలు తమ పరిధిని దాటి ప్రవర్తించకూడదని ఇరాన్ తేల్చి చెప్పింది.

Next Story