- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సామాన్యుడికి డీజిల్ సెగ!
ఇరాన్ మంటల సెగలు సామాన్యుడికి తాకుతున్నాయి. ఎక్కడో జరుగుతున్న యుద్ధానికి సబ్బునుంచి స్టీల్ వరకు ధరలు మండిపోనున్నాయి.

, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం ఇప్పుడు భారత పారిశ్రామిక రంగంపై తీవ్రంగా పడుతున్నది. కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఇండస్ట్రియల్ డీజిల్ ధరలు దాదాపు 46% పెరగడం గమనార్హం. ఇది నేరుగా వినియోగదారుల దైనందిన జీవితాన్ని, వస్తువుల ధరలను ప్రభావితం చేయనున్నది.
ఏమిటీ ఇండస్ట్రియల్ డీజిల్ సెగ?
మనం వాహనాల్లో వాడే డీజిల్ ధరలను ప్రభుత్వం కొంతవరకు నియంత్రిస్తున్నప్పటికీ, పరిశ్రమల్లో వాడే ఇండస్ట్రియల్ డీజిల్ ధరలు పూర్తిగా అంతర్జాతీయ మార్కెట్‌తో ముడిపడి ఉంటాయి. మార్చి 1న లీటరుకు ₹64.00 ఉన్న ధర, మార్చి 20 నాటికి ₹94.00 - ₹96.00 కు చేరింది. ఈ భారీ పెరుగుదల తయారీ వ్యయాన్ని అమాంతం పెంచేసింది. ఫలితంగా అనేక రంగాలపై దీని ప్రభావం తీవ్రంగా పడగా.. అంతిమంగా అది వినియోగదారులకు భారంగా మారనున్నది.
ఇల్లు కట్టడం ఇక భారమే
సిమెంట్, స్టీల్ తయారీలో ఇండస్ట్రియల్ డీజిల్ కీలక ఇంధనం. బాయిలర్లు, ఫర్నేస్ నడవడానికి ఈ చమురు అవసరం. ఇంధన ధర పెరగడంతో తయారీ సంస్థలు ఆ భారాన్ని డీలర్లపై, అక్కడి నుండి సామాన్యుడిపై వేస్తున్నాయి. ఫలితంగా సిమెంట్ బస్తా, టన్ను స్టీల్ ధరలు పెరిగి మధ్యతరగతి వాసుల సొంతింటి కల మరింత భారం కానున్నది.
ఆహార శుద్ధి, నిత్యావసరాలు
పాల డైరీలు, రైస్ మిల్లులు, ప్యాకేజ్డ్ ఫుడ్ కంపెనీలు తమ యంత్రాల నిర్వహణకు ఈ డీజిల్‌నే వాడుతుంటాయి. పాలను పాశ్చరైజ్ చేయడానికి అయ్యే ఖర్చు పెరగడం వల్ల లీటరు పాలపై ధర పెరిగే అవకాశం ఉంది. చిప్స్, బిస్కెట్లు వంటి ఉత్పత్తుల ధరలు పెరగడమో లేదా వాటి బరువు తగ్గడమో జరగవచ్చు.
వస్త్ర పరిశ్రమ
బట్టలకు రంగులు అద్దకం, ఫినిషింగ్ ప్రక్రియల్లో భారీగా ఇండస్ట్రియల్ డీజిల్ అవసరమవుతుంది. సూరత్, అహ్మదాబాద్ తోపాటు మన రాష్ట్రంలోని వస్త్ర పరిశ్రమతో సంబంధమున్న పోచంపల్లి, సిరిసిల్ల సహా అనేక ప్రాంతాల్లోని టెక్స్‌టైల్ యూనిట్లపై ఈ ప్రభావం పడనున్నది. ఇది అంతిమంగా దుస్తుల ధరల పెరుగుదలకు దారితీయనున్నది.
విద్యుత్ కోతలు
పవర్ గ్రిడ్ సమస్యలు ఉన్నప్పుడు పరిశ్రమలు భారీ డీజిల్ జనరేటర్లపై ఆధారపడతాయి. ఇప్పుడు డీజిల్ ధర పెరగడంతో, ఒక యూనిట్ విద్యుత్ ఉత్పత్తి ఖర్చు భారీగా పెరిగింది. ఇది చిన్న తరహా పరిశ్రమల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నది.
వినియోగదారుడికి ‘త్రిముఖ’ దెబ్బ
ఉత్పత్తి ఖర్చులు పెరగడం వల్ల వినియోగదారుడు కొనే ప్రతి వస్తువు (సబ్బు నుండి స్టీల్ వరకు) ధరలు పెరిగేందుకు అవకాశం ఉన్నది. దీంతోపాటు పారిశ్రామిక డీజిల్ ధర పెరగడం వల్ల రవాణా అనుబంధ ఉత్పత్తుల ధరలు పెరిగి, సరుకు రవాణా ఛార్జీలు కూడా అధికమవుతాయి. ఫలితంగా మార్కెట్లో నగదు లభ్యత తగ్గడం.. వస్తువుల ధరలు పెరగడం వల్ల సామాన్యుడి పొదుపు తగ్గిపోతుంది. ఇది ద్రవ్యోల్బణం పెరిగేందుకు కారణం అవుతుంది. అంతిమంగా ఇరాన్ సంక్షోభం త్వరగా సద్దుమణిగితే తప్ప చమురు ధరలు దిగి వచ్చే సూచనలు లేవు. ప్రభుత్వం పన్నుల విషయంలో (ముఖ్యంగా జీఎస్టీ పరిధిలోకి చమురును తీసుకురావడం) ఏదైనా వెసులుబాటు కల్పిస్తే తప్ప, పరిశ్రమలే కాదు అంతిమంగా వినియోగదారుడికి ఈ ‘డీజిల్ సెగ’ నుండి ఉపశమనం లభించదు.






