- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Green Card: ఇకపై గ్రీన్‌కార్డు నిబంధనలు కఠినతరం.. అందరికీ కాదు!
అమెరికాలో శాశ్వత నివాస హక్కు (గ్రీన్‌కార్డు) పొందాలనుకునే తాత్కాలిక వలసదారులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది.

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికాలో శాశ్వత నివాస హక్కు (గ్రీన్‌కార్డు) పొందాలనుకునే తాత్కాలిక వలసదారులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇకపై గ్రీన్‌కార్డు దరఖాస్తుల ప్రక్రియ కోసం వలసదారులు తమ స్వదేశానికి వెళ్లాల్సి ఉంటుందని అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (USCIS) స్పష్టం చేసింది. అయితే, ఈ కఠిన నిబంధనల నుంచి తాజాగా కొన్ని కీలక మినహాయింపులను కూడా ప్రకటించింది. అమెరికా జాతీయ ప్రయోజనాలు లేదా ఆర్థిక ప్రయోజనాలకు ఉపయోగపడే వలసదారులకు మాత్రమే ఈ నిబంధనల నుండి మినహాయింపు లభిస్తుందని పేర్కొంది.
‘అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్’ కు చెక్!
జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు అమెరికాలో స్టూడెంట్, టూరిస్ట్ లేదా తాత్కాలిక వర్క్ వీసాలపై ఉన్న విదేశీయులు దేశం విడిచి వెళ్లకుండానే ‘అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్’ ద్వారా గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. కానీ, కొత్త విధానం ప్రకారం దీనికి భిన్నంగా మార్చారు. అంటే అత్యంత అరుదైన, అసాధారణ పరిస్థితుల్లో తప్ప మిగిలిన వారంతా తమ మాతృదేశంలోని అమెరికా ఎంబసీ లేదా కాన్సులేట్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వలస చట్టాల దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఎస్‌సీఐఎస్ తెలిపింది.
ఆర్థిక, జాతీయ ప్రయోజనాలే ప్రామాణికం
‘అమెరికాకు ఆర్థికంగా లేదా జాతీయ ప్రయోజనాల పరంగా లబ్ధి చేకూర్చే దరఖాస్తుదారులను ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారమే కొనసాగేలా మినహాయింపు ఇస్తాం. మిగిలిన వారు మాత్రం కచ్చితంగా స్వదేశానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది’ అని యూఎస్‌సీఐఎస్ ప్రతినిధి జాక్ కహ్లర్ వెల్లడించారు. అయితే, అమెరికాకు ప్రయోజనం కలిగించే వ్యక్తులను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారనే విషయాన్ని అధికారులు ఇంకా స్పష్టం చేయలేదు.
భారతీయులపై తీవ్ర ప్రభావం?
ఈ కొత్త నిబంధనల వల్ల అమెరికాలో ఉన్న లక్షలాది మంది విదేశీయులు, ముఖ్యంగా భారతీయులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. మైగ్రేషన్ పాలసీ ఇన్స్టిట్యూట్ (MPI) 2026 నివేదిక ప్రకారం.. అమెరికాలో దాదాపు 32 లక్షల మంది భారతీయ వలసదారులు నివసిస్తున్నారు. 2024లో జారీ చేసిన మొత్తం H1B వీసాల్లో 71 శాతం భారతీయులకే దక్కాయి. అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో (ముఖ్యంగా STEM రంగాల్లో) భారతీయులే అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ప్రస్తుతం అమెరికాలోనే ఉంటూ గ్రీన్‌కార్డు కోసం వేచి చూస్తున్న లక్షలాది మంది దరఖాస్తుదారుల భవితవ్యంపై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.






