ప్రధాని మోడీకి మెలోనీ అభినందనలు.. భారత్-ఇటలీ బంధానికి కొత్త ఊపు

by Ramesh Naini |

భారతదేశ చరిత్రలోనే అత్యధిక కాలం ప్రధానిగా సేవలందించిన ‘ఎన్నికైన’ నాయకుడిగా నరేంద్ర మోడీ సరికొత్త రికార్డు సృష్టించారు.

ప్రధాని మోడీకి మెలోనీ అభినందనలు.. భారత్-ఇటలీ బంధానికి కొత్త ఊపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారతదేశ చరిత్రలోనే అత్యధిక కాలం ప్రధానిగా సేవలందించిన ‘ఎన్నికైన’ నాయకుడిగా నరేంద్ర మోడీ సరికొత్త రికార్డు సృష్టించారు. కేంద్రంలో 12 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న ఆయన, ప్రధానిగా 4,399 రోజులు పూర్తి చేసుకున్నారు. తద్వారా దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ (ఎన్నికైన ప్రధానిగా 4,398 రోజులు) పేరిట ఉన్న రికార్డును మోడీ అధిగమించారు. ఈ చారిత్రాత్మక మైలురాయిని అందుకున్న ప్రధాని మోడీకి ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

వ్యూహాత్మక బంధం.. కొత్త అవకాశాలు

ఇటీవలే మే నెలలో ప్రధాని మోడీ ఇటలీలో పర్యటించిన విషయాన్ని మెలోనీ తన పోస్టులో గుర్తు చేసుకున్నారు. రోమ్‌లో జరిగిన సమావేశంలో ఇరు దేశాల బంధాన్ని ‘ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం’ (Special Strategic Partnership) స్థాయికి పెంచినట్లు ఆమె పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రజలకు సరికొత్త అవకాశాలు సృష్టించేందుకు, భవిష్యత్తును మరింత బలోపేతం చేసేందుకు కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

వైరల్ అయిన ‘మెలోడీ’ ముచ్చట

ఈ అధికారిక చర్చలతో పాటు ఇరు నేతల మధ్య ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం మరోసారి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇటలీ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ.. జార్జియా మెలోనీకి ‘మెలోడీ’ (Melody) చాక్లెట్ ప్యాకెట్‌ను బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. నెటిజన్లు వీరిద్దరి పేర్లను కలిపి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్న #Melodi హాష్‌ట్యాగ్‌ను గుర్తు చేస్తూ మోడీ ఈ సరదా గిఫ్ట్ అందించడం విశేషం. దీనికి సంబంధించిన వీడియోను మెలోనీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ.. ‘ప్రధాని మోడీ మాకోసం ఎంతో రుచికరమైన ‘మెలోడీ’ టోఫీలను బహుమతిగా తెచ్చారు, థాంక్యూ’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ వేదికలపై ఇరు దేశాల అధినేతల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలకు, బలపడుతున్న భారత్-ఇటలీ బంధానికి ఈ ‘మెలోడీ’ ట్రెండ్ ఒక ప్రతీకగా నిలిచింది.

Next Story