ప్రజా భద్రత,నేరాల నియంత్రణే లక్ష్యం..

by Taduka Kalyani |

ఆదిలాబాద్ జిల్లాలో ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడం,నేరాల నియంత్రణ, విచారణను సమర్థవంతంగా నిర్వహించడం లక్ష్యంగా ఏర్పాటు చేసిన 300 నూతన సీసీటీవీ కెమెరాలను రాష్ట్ర డీజీపీ సి.వి.ఆనంద్ బుధవారం స్థానిక కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ప్రారంభించారు.

ప్రజా భద్రత,నేరాల నియంత్రణే లక్ష్యం..
X

దిశ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడం,నేరాల నియంత్రణ, విచారణను సమర్థవంతంగా నిర్వహించడం లక్ష్యంగా ఏర్పాటు చేసిన 300 నూతన సీసీటీవీ కెమెరాలను రాష్ట్ర డీజీపీ సి.వి.ఆనంద్ బుధవారం స్థానిక కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ప్రారంభించారు.ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి, భద్రతా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ముందుగా పోలీస్ గెస్ట్ హౌస్‌లో జిల్లా సాయుధ సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరించిన డీజీపీ,అనంతరం మొక్క నాటి పచ్చదనం ప్రాముఖ్యతను చాటిచెప్పారు.జిల్లా వ్యాప్తంగా 220 సీసీటీవీ కెమెరాలను గ్రామీణ ప్రాంతాల్లో,80 కెమెరాలను పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.వీటి ద్వారా ప్రజల రక్షణ,ట్రాఫిక్ పర్యవేక్షణ,నేరాల నివారణ,నిందితుల గుర్తింపు వంటి అంశాల్లో పోలీసు శాఖకు మరింత సహకారం అందనుంది. అలాగే కలెక్టర్ చౌక్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్‌ను డీజీపీ ప్రారంభించారు.ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ఈ సిగ్నల్స్ ఉపయోగపడనున్నాయి.అదేవిధంగా ఏఆర్ హెడ్‌క్వార్టర్స్ ఎంటీ సెక్షన్‌లో ఏర్పాటు చేసిన హైడ్రాలిక్స్, పోలీస్ ఫ్యామిలీ క్వార్టర్స్‌లో చిల్డ్రన్ పార్క్,డీపీవో కార్యాలయం ఎదురుగా నిర్మించిన ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను కూడా ఆయన ప్రారంభించారు.డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా జిల్లాకు వచ్చిన సి.వి.ఆనంద్‌కు అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రజలకు మరింత మెరుగైన భద్రతా సేవలు అందించేందుకు తెలంగాణ పోలీసు శాఖ కట్టుబడి ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉమెన్ సేఫ్టీ, సీఐడీ, ఏసీబీ డీజీ చారు సిన్హా, మల్టీజోన్-1 ఐజీ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా,జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్,మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి,మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష, అదనపు ఎస్పీ పి.మౌనిక, ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story