- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ టెస్టు జట్టు వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ టెస్టుల్లో నం.1 బ్యాటర్‌గా అవతరించాడు. బుధవారం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌ను అప్‌డేట్ చేసింది. రెండో స్థానంలో ఉన్న అతను తాజా ర్యాంకింగ్స్‌లో ఒక్క స్థానం మెరుగుపర్చుకుని టాప్ ర్యాంక్‌కు దూసుకెళ్లాడు. 869 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇంతకుముందు ఇంగ్లాండ్‌కే చెందిన జో రూట్ టాప్ పొజిషన్‌లో ఉండగా తన ర్యాంక్‌ను కోల్పోయాడు. రెండు స్థానాలు పడిపోయి 3వ స్థానానికి దిగజారాడు. ఆస్ట్రేలియాకు చెందిన ట్రావిస్ హెడ్ ఒక్క స్థానం ఎగబాకి 2వ ర్యాంక్‌లో నిలిచాడు. బ్రూక్ కంటే హెడ్ 16 పాయింట్స్ వెనుకబడి ఉన్నాడు. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్, శ్రీలంకకు చెందిన కామిందు మెండిస్ వరుసగా 4, 5 స్థానాల్లో ఉన్నారు.
గిల్ ర్యాంక్ మెరుగు
భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన ర్యాంక్‌ను మెరుగుపర్చుకున్నాడు. 10వ స్థానంలో ఉన్న అతను రెండు స్థానాలు అధిగమించి 8వ స్థానానికి చేరుకున్నాడు. ఇటీవల అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో గిల్ సత్తాచాటిన విషయం తెలిసిందే. సెంచరీతో రాణించాడు. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఒక్క ర్యాంక్ కోల్పోయి 9వ స్థానానికి పడిపోగా.. వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ ఒక్క స్థానం మెరుగుపర్చుకున్నాడు. 13వ స్థానం నుంచి 12వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. అయితే, అఫ్గాన్‌తో జరిగిన టెస్టులో కేఎల్ రాహుల్ సెంచరీ బాదినప్పటికీ అతను ర్యాంక్ ముందుకు జరగకపోవడం గమనార్హం. అతను 34వ స్థానంలో ఉన్నాడు. భారత స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా నం.1 బౌలర్‌గా తన ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. అఫ్గాన్‌పై 5 వికెట్లు తీసిన వాషింగ్టన్ సుందర్ 5 స్థానాలు ఎగబాకి 48వ ర్యాంక్‌లో నిలిచాడు. ప్రసిద్ధ్ కృష్ణ 9 స్థానాలు ముందుకు జరిగి 51వ స్థానానికి చేరుకున్నాడు.






