- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లెజెండరీ దర్శకుడు భారతీ రాజా ఇకలేరు.. తొలిమూవీ ‘పదహారేళ్ల వయసు’తో సెన్సేషనల్ హిట్
భారతీయ సినీ పరిశ్రమ నుంచి మరో దిగ్గజ దర్శకుడు రాలిపోయాడు.

దిశ, సినిమా: భారతీయ సినీ పరిశ్రమ నుంచి మరో దిగ్గజ దర్శకుడు రాలిపోయాడు. కానీ, ఆయన సృష్టించిన పాత్రలు, కథలు, భావోద్వేగాలు మాత్రం చరిత్రలో ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోనున్నాయి. గ్రామీణ జీవన సౌందర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన సినీ మహర్షి ఆయన. దర్శకుడిగా, నటుడిగా, గురువుగా వేలాది మందికి స్ఫూర్తిగా నిలిచిన సినీ దిగ్గజం భారతీరాజా తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో భారతీయ సినీ పరిశ్రమ ఒక స్వర్ణయుగాన్ని కోల్పోయినట్టయింది. వైవిధ్యమైన చిత్రాలకు మారుపేరుగా నిలిచిన ఈ తమిళ దర్శకుడి సినిమా వస్తోందంటే చాలు.. ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసేవారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను బాక్సాఫీసుకు అందించి కాసుల వర్షాన్ని కురిపించిన లెజెండరీ ఆయన. దర్శకునిగానే కాదు, నటుడిగానూ పలు సినిమాలతో అలరించి తమిళ దిగ్గజ దర్శకుల్లో ఒకరిగా నిలిచినా భారతీ రాజా (85) గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చెన్సైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం తెల్లవారు జామున కన్నుమూశారు. 1941 జులై 17న జన్మించిన భారతీ రాజా.. పదహారేళ్ల వయసులోనే సీతాకోక చిలుక, ఆరాధన సినిమాలకు జాతీయ అవార్డులు సైతం అందుకున్నారు.
అసిస్టెంట్ డైరెక్టర్‌గా తొలి అడుగు:
భారతీరాజా అసలు పేరు చిన్నస్వామి. 1941 జులై 17న తమిళనాడులోని తేనిఅల్లినగరంలో జన్మించారు. ఈయన చిన్నప్పటి నుంచే కళల పట్ల ఆకర్షితుడై సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని తపించేవారు. అప్పట్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమా రంగాలన్నిటికీ ప్రధాన కేంద్రం మద్రాసు. దీంతో మద్రాసుకు వెళ్లి సినిమా రంగంలో ప్రవేశించేందుకు పడరాని పాట్లు పడ్డారు. ఈ క్రమంలోనే మొదట కన్నడ దర్శకుడు పుట్టన్న కణగల్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరారు. తరువాత తెలుగు దర్శకులు పి.పుల్లయ్య వద్ద కొన్ని చిత్రాలకు పనిచేశారు. మలయాళ దర్శకుడు ఎమ్.కృష్ణన్ నాయర్, తమిళ దర్శకుడు ఎ. జగన్నాథన్ చిత్రాలకూ అసోసియేట్‌గా, కో-డైరెక్టర్‌గా ఉన్నారు. భారతీరాజా కేవలం కథలను చెప్పడమే కాదు, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసేలా చిత్రాలను తెరకెక్కించిన ఆయన, నాలుగు దశాబ్దాలకు పైగా తన సినిమాలతో కోట్లాది మంది అభిమానులను అలరించారు. గ్రామీణ నేపథ్య కథలకు కొత్త ఊపిరి పోసి, అనేక మంది నటీనటులు, సాంకేతిక నిపుణులను సినీ ప్రపంచానికి పరిచయం చేసిన భారతీరాజా మరణం భారతీయ చిత్రసీమకు తీరని లోటుగా మారింది. ఆయన మరణాన్ని కోలీవుడ్ జీర్ణించుకోలేకపోతోంది. భారతీరాజా పార్థివ దేహానికి పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు నివాళి అర్పిస్తున్నారు.
మొదటి చిత్రంతోనే సంచలనం:
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దర్శకుల వద్ద పనిచేయడంతో భారతీరాజాకు దర్శకత్వంపై మంచి పట్టు లభించింది. దీంతో రెగ్యులర్ మూవీస్‌కు భిన్నంగా ఉండాలనే తపనతో.. 1977లో విడుదలైన ‘16 వయతినిలే’ చిత్రంతో దర్శకుడిగా రంగప్రవేశం చేశాడు. ఇదే సినిమాను తెలుగులో ‘పదహారేళ్ల వయసు’ టైటిల్‌తో డబ్ చేశారు. తమిళంతో పాటు తెలుగులో కూడా సంచలన విజయం సాధించిందీ చిత్రం. దీంతో మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తొలి దర్శకుడిగా చరిత్ర సృష్టించారు భారతీరాజా. అంతే కాకుండా.. అప్పటివరకు కేవలం స్టూడియో సెట్టింగులకే పరిమితమైన తమిళ సినిమాను నిజమైన పల్లెటూరి లొకేషన్లలోకి తీసుకెళ్లి సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. ఈయన రెండో చిత్రం 'కిళక్కే పోగుం రైల్'తో రాధికను హీరోయిన్‌గా, సుధాకర్‌ను (తరువాత తెలుగులో ఫేమస్ కమెడియన్‌గా మారారు) హీరోగా పరిచయం చేశారు. అలాగే ఇళయరాజా, వారి సోదరులను కూడా చిత్రసీమలో అడుగు పెట్టేలా చేయడానికి భారతీరాజా ఎంతగానో సహకరించారు. మూడో చిత్రం ‘ఎర్ర గులాబీలు’ (కమల్, శ్రీదేవి), నాల్గొవ చిత్రంగా '16 వయదినిలే'ను హిందీలో 'సోల్వా సావన్'గా తెరకెక్కించారు. ఈ సినిమాతోనే శ్రీదేవి హిందీ చిత్రసీమలో అడుగుపెట్టింది. ఇలా ఎంతోమంది స్టార్ హీరో, హీరోయిన్లను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు భారతీరాజా. అంతే కాకుండా తీసిన ప్రతి సినిమా సూపర్ సక్సెస్ కావడంతో.. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.
నటుడిగానూ రాజాది రాజా :
డైరెక్టర్‌గా సినిమాలు తెరకెక్కిస్తూనే.. కొన్ని చిత్రాలలో అతిథిగా కనిపించిన భారతీరాజా, మణిరత్నం తెరకెక్కించిన 'యువ' సినిమా ద్వారా నటుడిగా మారారు. తరువాత పలు చిత్రాలలో నటించారు. శింబు హీరోగా వచ్చిన ఈశ్వరన్‌లో కీలక పాత్ర పోషించి మెప్పించారు. 2022లో వచ్చిన ధనుష్ తీరు సినిమాలో కీలక పాత్రలో కనిపించి ఆ సినిమా విజయంలో ముఖ్య పాత్ర పోషించారు.
అవార్డుల పంట:
* తన కెరీర్‌లో దాదాపు 40 చిత్రాలకు దర్శకత్వం వహించిన భారతీరాజాకు ‘ఇయక్కునార్ ఇమయం’ (దర్శక శిఖరం) అనే బిరుదును పొందారు.
* పద్మశ్రీ పురస్కారం: సినీ రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ 2004లో భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించింది.
* జాతీయ అవార్డులు: వివిధ విభాగాల్లో మొత్తంగా 6 జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకున్నారు. ఇందులో తెలుగు సినిమా ‘సీతాకోకచిలుక’కు ఉత్తమ ప్రాంతీయ చిత్ర అవార్డు వరించింది. ఇక వీటితో పాటు 4 ఫిలిం ఫేర్ అవార్డులు, 6 తమిళనాడు రాష్ట్ర అవార్డులు, నంది అవార్డులను భారతీరాజా సొంతం చేసుకున్నారు.
నిరాశపరిచిన చివరి సినిమా :
2013లో ఆయన తెరకెక్కించిన 'అన్నకోడి' అంతగా అలరించలేకపోయింది. దాంతో దాదాపు ఏడేళ్లు మెగాఫోన్ పట్టలేదు భారతీరాజా. 2020లో ఆయన రూపొందించిన 'మీండుమ్ ఒరు మరియాదై' కూడా ఆకట్టుకోలేదు. ఇందులో ఆయనే ప్రధాన పాత్ర పోషించారు.
కొడుకును కోల్పోయి..:
భారతీరాజా 1974లో చంద్రలీలను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. కొడుకు మనోజ్ 'తాజ్ మహల్' చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. నటి నందనను వివాహం చేసుకున్నాడు. ఇక 2025 మార్చి 25న గుండెపోటుతో మనోజ్ మరణించారు. కూతురు జనని మలేషియాకు చెందిన రాజ్ కుమార్ తంబిరాజాను వివాహం చేసుకున్నారు.
మరో తరాన్ని తయారు చేస్తూ..
కాగా.. తర్వాతితరం చిత్ర నిర్మాతలకు శిక్షణ ఇవ్వడానికి భారతీరాజా ‘భారతీరాజా ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సినిమా’ ని స్థాపించారు. అందులో ఎంతో మందికి శిక్షణ ఇస్తున్నారు. ఇలా ఎన్నో మంచి సినిమాలను అందించడం, ఎంతోమంది నటీనటులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేయడం, ముఖ్యంగా ప్రేక్షకులను ప్రేమతో పలకరించే భారతీరాజాను కోల్పోవడంతో చిత్ర సీమలో ఓ సువర్ణ అధ్యాయం ముగిసినట్లైంది.






