రైతు పేరుతో నకిలీగా మొక్కజొన్న కాంటాలు..?

by Taduka Kalyani |

వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన రైతు కొల్లూరి రాములు పేరుతో ఆయనకు తెలియకుండా మొక్కజొన్న కాంటాలు నిర్వహించారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

రైతు పేరుతో నకిలీగా మొక్కజొన్న కాంటాలు..?
X

దిశ, పర్వతగిరి: వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన రైతు కొల్లూరి రాములు పేరుతో ఆయనకు తెలియకుండా మొక్కజొన్న కాంటాలు నిర్వహించారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రైతు తెలిపిన వివరాల ప్రకారం.. సర్వే నెం. 434/2లో ఆయనకు 4 ఎకరాల 23 గుంటల వ్యవసాయ భూమి ఉండగా,అందులో సుమారు ఎకరన్నరలో మొక్కజొన్న,మిగిలిన మూడు ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. దౌలత్‌నగర్ గ్రామానికి చెందిన చీమల సంతోష్ అనే వ్యక్తి రైతుల వద్ద నుంచి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసి, వారి పట్టాదార్ పాస్‌బుక్లు, బ్యాంకు ఖాతా వివరాల జిరాక్స్‌లు సేకరించి, రైతుల పేర్లతోనే మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కొల్లూరి రాములకు చెందిన పట్టాదార్ పాస్‌బుక్, ఖాతా వివరాల జిరాక్స్‌లు తీసుకుని, ఆయన అనుమతి లేకుండానే సుమారు మూడున్నర ఎకరాల్లో మొక్కజొన్న పండించినట్లు నమోదు చేసి కాంటాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే తాను పండించిన వరి ధాన్యాన్ని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో విక్రయించేందుకు వెళ్లగా, "మీ భూమిలో కేవలం ఒక ఎకరం మాత్రమే పంట నమోదై ఉంది, మిగతా భూమి ఇప్పటికే మొక్కజొన్న సాగుగా నమోదు అయింది" అని కేంద్ర నిర్వాహకులు చెప్పడంతో రైతు అవాక్కయ్యాడు. దీంతో వెంటనే చీమల సంతోష్‌ను ఫోన్‌లో సంప్రదించగా, "వేరే రైతుల పట్టా పాస్‌బుక్లు ఇప్పిస్తాను" అంటూ సమాధానం చెప్పినట్లు రైతు ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, రైతు పేరుతో అనుమతి లేకుండా కాంటాలు నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతు కొల్లూరి రాములు అధికారులను కోరుతున్నారు. రైతుల పాస్‌బుక్ వివరాలను దుర్వినియోగం చేస్తున్న వారిపై నిఘా పెంచాలని పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story