అర్జెంటీనా జట్టులో భారీ భద్రతా లోపం.. మెస్సితో సహా ఆటగాళ్ల పాస్‌పోర్ట్ వివరాలు లీక్

by Kema Shiva Kumar |

ఫిఫా వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి ముందే అర్జెంటీనా జట్టుకు ఊహించని షాక్ తగిలింది.

అర్జెంటీనా జట్టులో భారీ భద్రతా లోపం.. మెస్సితో సహా ఆటగాళ్ల పాస్‌పోర్ట్ వివరాలు లీక్
X

దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ కప్ వేడుకలు ప్రారంభం కావడానికి ముందే అర్జెంటీనా జట్టుకు షాకింగ్ ఘటన ఎదురైంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న అర్జెంటీనా జట్టు ఆటగాళ్లకు సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారం అధికారిక నిర్లక్ష్యం వల్ల బయటకు పొక్కింది. వరల్డ్ కప్‌ సందర్భంగా అల్బామాలోని జోర్డాన్-హేర్ స్టేడియంలో ఐస్‌లాండ్‌తో జరిగిన ఒక వార్మప్ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన జరిగింది. మ్యాచ్‌కు ముందు మీడియాకు, ప్రజలకు పంపిణీ చేసిన అధికారిక టీమ్ షీట్‌లో ఘోరమైన తప్పు దొర్లింది. కెప్టెన్ లియోనెల్ మెస్సితో పాటు అర్జెంటీనా స్క్వాడ్‌లోని ప్రతి ఒక్క ఆటగాడి పాస్‌పోర్ట్ నంబర్లు ఎలాంటి బ్లర్, ఎడిటింగ్ లేకుండా నేరుగా ప్రింట్ అయి అందరికీ చేరిపోయాయి. అయితే, సాధారణంగా ఇలాంటి పత్రాలను పబ్లిక్ చేసేటప్పుడు పాస్‌పోర్ట్ నంబర్ల లాంటి వ్యక్తిగత వివరాలను పూర్తిగా తొలగిస్తారు. అయితే, ఐస్‌లాండ్ జట్టు ఆటగాళ్లు తమ పాస్‌పోర్ట్ వివరాలను ఆ షీట్‌లో సమర్పించకపోవడంతో వారు ఈ లీక్ నుంచి తృటిలో తప్పించుకున్నారు.

కాగా, వెనుక ఇంత పెద్ద భద్రతా లోపం జరిగినప్పటికీ, మైదానంలో మాత్రం అర్జెంటీనా అద్భుత ప్రదర్శన చేసింది. దాదాపు 88,000 మందికి పైగా ప్రేక్షకుల సమక్షంలో జరిగిన ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా 3-0 తేడాతో ఐస్‌లాండ్‌పై ఘన విజయం సాధించింది. హామ్‌స్ట్రింగ్ గాయం నుంచి కోలుకుని సెకండ్ హాఫ్‌లో సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి అడుగుపెట్టిన లియోనెల్ మెస్సీ.. కేవలం 2 నిమిషాల్లోనే పెనాల్టీ ద్వారా గోల్ కొట్టి రికార్డు సృష్టించాడు.

Next Story