- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈత రాక.. ప్రాణాలకు ముప్పు
నేటి బాలలే రేపటి పౌరులు. అయితే భవిష్యత్తులో దేశానికి బలంగా నిలవాల్సిన చిన్నారులు నీటి ప్రమాదాల కారణంగా అకాలంగా ప్రాణాలు కోల్పోతున్నారు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నేటి బాలలే రేపటి పౌరులు. అయితే భవిష్యత్తులో దేశానికి బలంగా నిలవాల్సిన చిన్నారులు నీటి ప్రమాదాల కారణంగా అకాలంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈత రాకపోవడం, నీటిలో తేలియాడే ప్రాథమిక నైపుణ్యాలు లేకపోవడం వల్ల ప్రతి ఏడాది అనేక కుటుంబాలు విషాదంలో మునిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈతను కేవలం క్రీడగా కాకుండా ప్రాణాలను కాపాడే జీవన నైపుణ్యంగా గుర్తించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నీటి ప్రమాదాలు జరిగినప్పుడు సానుభూతి ప్రకటించడమే కాకుండా, విద్యా వ్యవస్థలోనే ఈత శిక్షణకు ప్రాధాన్యం కల్పించాలని పలువురు సూచిస్తున్నారు.
గ్రామీణ జీవితంలో భాగమైన ఈత
ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు, కుంటలు, కాలువలు, తోట బావులు ప్రజల దైనందిన జీవితంలో అంతర్భాగంగా ఉండేవి. పిల్లలు చిన్నప్పటి నుంచే వాటి వద్ద ఆడుకుంటూ పెద్దల పర్యవేక్షణలో ఈత నేర్చుకునేవారు. గ్రామీణ సమాజంలో ఈతను కేవలం వినోదంగా కాకుండా అవసరమైన జీవన నైపుణ్యంగా భావించేవారు. అయితే కాలక్రమేణా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పట్టణీకరణ, జనాభా పెరుగుదల కారణంగా అనేక చెరువులు కనుమరుగయ్యాయి. వర్షాభావం, భూగర్భ జలాల తగ్గుదలతో బావులు ఎండిపోగా, చాలా నీటి వనరులు వ్యవసాయ భూముల్లో కలిసిపోయాయి. ఫలితంగా సహజసిద్ధంగా ఈత నేర్చుకునే అవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయి.
పిల్లలకే కాదు.. పెద్దలకూ ఈత రాదు
ప్రస్తుతం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పిల్లలతో పాటు పెద్దల్లోనూ ఈత తెలియని వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. దీంతో వేసవి, వర్షాకాలాల్లో నీటి ప్రమాదాలు పెరుగుతున్నాయి. స్నేహితులతో సరదాగా చెరువులు, కుంటల్లోకి దిగిన చిన్నారులు నీటి లోతు అంచనా వేయలేక ప్రమాదాలకు గురవుతున్నారు. కొన్నిసార్లు మునిగిపోతున్న వారిని రక్షించేందుకు వెళ్లినవారే ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే వేసవి సెలవుల కాలంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పది మందికిపైగా నీటి ప్రమాదాల్లో మృతి చెందినట్లు సమాచారం. ఇక వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో చెరువులు, కుంటలు నిండే అవకాశం ఉండటంతో మరింత అప్రమత్తత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
పెరుగుతున్న నీటి ప్రమాదాలు
ఇటీవలి కాలంలో నీటిలో మునిగి మరణించే ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా సెలవుల సమయంలో పిల్లలు చెరువులు, కాలువలు, కుంటల వద్దకు వెళ్లడం సహజం. ఈత రాకపోవడం, నీటి లోతు తెలియకపోవడం, ప్రవాహ తీవ్రతను అంచనా వేయలేకపోవడం వంటి కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈత తెలిసిన వ్యక్తికీ కొన్ని సందర్భాల్లో ప్రమాదం తప్పకపోవచ్చు. కానీ ఈత రాని వ్యక్తికి ప్రమాదం ఎదురైతే ప్రాణాలతో బయటపడే అవకాశాలు మరింత తగ్గిపోతాయి.
సహజంగా నేర్చుకునే నైపుణ్యం.. ఇప్పుడు అరుదు
గత తరాల్లో పిల్లలు వేసవి సెలవులను చెరువుల వద్ద గడుపుతూ ఈత నేర్చుకునేవారు. గ్రామ పెద్దలు, యువకులు వారికి శిక్షణ ఇచ్చేవారు. బావుల్లో నీళ్లు తీయడం, చెరువుల్లో స్నానం చేయడం వంటి పనుల ద్వారా కూడా ఈత పై అవగాహన పెరిగేది. ప్రస్తుతం పిల్లల జీవితం ఎక్కువగా ఇళ్లు, పాఠశాలలు, మొబైల్ ఫోన్లకే పరిమితమవుతోంది. ప్రకృతితో అనుబంధం తగ్గిపోవడంతో పాటు ఈత వంటి ప్రాథమిక జీవన నైపుణ్యాలు కూడా క్రమంగా దూరమవుతున్నాయి.
ఈత కేవలం క్రీడ కాదు
చాలామంది ఈతను ఒక క్రీడగా మాత్రమే భావిస్తారు. కానీ అది ప్రాణాలను కాపాడగలిగే కీలక జీవన విద్య. ప్రమాద సమయంలో కొంతసేపు నీటిపై తేలియాడడం, ఒడ్డుకు చేరుకోవడం, సహాయం వచ్చే వరకు తట్టుకోవడం వంటి సామర్థ్యాలు ప్రాణరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా ఈత వల్ల శారీరక దృఢత్వం, ఊపిరితిత్తుల సామర్థ్యం, మానసిక ధైర్యం, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతాయి.
తల్లిదండ్రులు, ప్రభుత్వాల పై బాధ్యత
ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలకు ఈత నేర్పించడం తల్లిదండ్రుల బాధ్యతగా మారుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో అవకాశాలు పరిమితంగా ఉన్నప్పటికీ పట్టణాలు, నగరాల్లో స్విమ్మింగ్ పూల్స్ సంఖ్య పెరుగుతోంది. ప్రత్యేక శిక్షణా కార్యక్రమాల ద్వారా పిల్లలకు ఈత నేర్పిస్తున్నారు. ఇటీవలి కాలంలో తల్లిదండ్రులు కూడా పిల్లల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఖర్చుకు వెనుకాడకుండా ఈత శిక్షణకు పంపిస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాల్లో సురక్షిత ఈత శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం, చెరువులు, కుంటల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి ముందస్తు భద్రతా చర్యలు చేపట్టడం వంటి అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
పాత తరానికి వరం.. కొత్త తరానికి అవసరం
ప్రకృతితో మమేకమై పెరిగిన పాత తరాలకు ఈత ఒక సహజ నైపుణ్యంగా ఉండేది. కానీ ఆధునిక జీవనశైలిలో అది క్రమంగా కనుమరుగవుతోంది. దాని ప్రభావంగా నీటి ప్రమాదాలు పెరుగుతూ అమాయక చిన్నారులు, యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ఈతను కేవలం వినోదం లేదా క్రీడగా కాకుండా, ప్రాణాలను కాపాడే జీవన విద్యగా ప్రతి కుటుంబం, ప్రతి సమాజం గుర్తించి ప్రోత్సహించాల్సిన సమయం ఆసన్నమైంది.






