- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వచ్చే వేసవి నాటికి మేడిగడ్డ పునరుద్ధరణ పూర్తి: మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
మేడిగడ్డ బ్యారేజీ తో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీల పునరుద్ధరణ పనులను అత్యంత శాస్త్రీయ పద్ధతిలో చేపట్టి 2027 వేసవి నాటికి పూర్తి చేసి తిరిగి వినియోగంలోకి తీసుకొస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మేడిగడ్డ బ్యారేజీ తో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీల పునరుద్ధరణ పనులను అత్యంత శాస్త్రీయ పద్ధతిలో చేపట్టి 2027 వేసవి నాటికి పూర్తి చేసి తిరిగి వినియోగంలోకి తీసుకొస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద జరుగుతున్న సాంకేతిక పరిశోధనలు, హైడ్రాలాజికల్ అధ్యయనాలు, జియో టెక్నికల్ పరీక్షలు, గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ సర్వేలు, పునరుద్ధరణ ప్రణాళికల పురోగతిని బుధవారం మంత్రి పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. జూలై తొలి వారానికి అన్ని సాంకేతిక, హైడ్రాలాజికల్ అధ్యయనాలు పూర్తవుతాయని చెప్పారు. అనంతరం సేకరించిన నివేదికలను కేంద్ర జల సంఘం, జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ(ఎన్‌డీఎస్‌ఏ)లకు పంపుతామని తెలిపారు. వాటి సూచనల మేరకు 2026 సెప్టెంబర్ నాటికి పునరుద్ధరణ డిజైన్లను ఖరారు చేస్తామని చెప్పారు. వర్షాకాలం ముగిసిన వెంటనే 2026 నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ తొలి వారంలో పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తామని.. ఒకే పని సీజన్‌లో పనులు పూర్తి చేసి 2027 వేసవి నాటికి బ్యారేజీలను తిరిగి అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి స్పష్టం చేశారు.
సాంకేతిక పరీక్షలు స్పీడప్..
హైడ్రాలజికల్ అధ్యయనాలతోపాటు జియోటెక్నికల్ బోర్‌హోల్ పరిశోధనలు, ఇతర సాంకేతిక పరీక్షలను వేగవంతం చేశామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం మూడు బ్యారేజీల్లో జీపీఆర్ పరీక్షలు 90 శాతం పూర్తయ్యాయని.. బోర్‌హోల్, జియోటెక్నికల్ పరిశోధనలు 80 శాతం పూర్తయ్యాయని చెప్పారు. జూన్ చివరి నాటికి అన్ని పరీక్షలు, పరిశోధనలు పూర్తవుతాయని వెల్లడించారు. భవిష్యత్తులో ఈ తరహా నష్టం పునరావృతం కాకుండా 40 నుంచి 80 మీటర్ల లోతు వరకు బోర్ హోల్స్ తవ్వి భూగర్భ పరిస్థితులపై సమగ్ర సమాచారం సేకరిస్తున్నామని చెప్పారు. కేంద్ర జల సంఘం, జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థల ఆమోదం వచ్చిన తర్వాతే పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. పునరుద్ధరణ డిజైన్ల కోసం ప్రపంచ ప్రఖ్యాత కన్సల్టెంట్ సంస్థ ఆఫ్రీని, ఐఐటీ బొంబాయితో కలిసి నియమించామని తెలిపారు. పుణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నమూనా అధ్యయనాలు, సాంకేతిక పరీక్షలు నిర్వహిస్తున్నదని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ నిపుణులను సైతం ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తున్నామని వివరించారు. అలాగే.. ఎన్‌డీఎస్‌ఏ గుర్తించిన స్కౌర్ డెప్త్, కట్-ఆఫ్ డెప్త్, టెయిల్ వాటర్ రేటింగ్ కర్వ్, ఎనర్జీ డిసిపేషన్, గేట్ల నిర్వహణ వంటి కీలక అంశాలపై సమగ్ర అధ్యయనాలు జరుగుతున్నాయని తెలిపారు.
గత ప్రభుత్వం తప్పుడు నిర్ణయాల వల్లే..
బీఆర్‌ఎస్ పాలకుల తప్పుడు నిర్ణయాలు, లోపభూయిష్ట విధానాలు, నిర్మాణ లోపాల కారణంగానే మేడిగడ్డ తో పాటు ఇతర బ్యారేజీలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఉత్తమ్ ఆరోపించారు. 2023 అక్టోబర్‌లో గత ప్రభుత్వ హయాంలోనే ఈ నష్టం జరిగిందన్నారు. అనంతరం నిర్వహించిన విచారణల్లో జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ, న్యాయ కమిషన్ పలు నిర్మాణ, డిజైన్, నిర్వహణ లోపాలను గుర్తించాయని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.38,000 కోట్ల అంచనా వ్యయంతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభించిందని గుర్తుచేశారు. 2014 నాటికే దాదాపు మూడోవంతు పనులు పూర్తయ్యాయని చెప్పారు. అదే ప్రాజెక్టును కొనసాగించి ఉంటే 2016-17 నాటికే పూర్తయి సుమారు 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని పేర్కొన్నారు. అయితే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రీ-డిజైన్ పేరుతో ప్రాజెక్టు అంచనాలను భారీగా పెంచిందని విమర్శించారు.
రూ.38,000 కోట్లతో ప్రారంభమైన ప్రాజెక్టు వ్యయం ప్రస్తుతం లక్ష కోట్ల రూపాయలు దాటిందని.. కాగ్ అంచనాల ప్రకారం అది రూ.1.45 లక్షల కోట్ల వరకు చేరే అవకాశం ఉన్నదని తెలిపారు. ఇంత భారీ ప్రజాధనం ఖర్చు చేసినప్పటికీ 2023 డిసెంబర్ 7 తర్వాత మూడు బ్యారేజీలు వినియోగంలో లేకపోవడం అత్యంత దురదృష్టకరమైన పరిణామమని అన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల ప్రజలపై, రాష్ట్ర ఖజానాపై భారీగా భారం పడిందని చెప్పారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తమ ప్రభుత్వం పునరుద్ధరణ ప్రక్రియను ప్రారంభించిందని పేర్కొన్నారు. గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్ది.. శాశ్వత భద్రతా ప్రమాణాలతో అన్ని బ్యారేజీలను పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు.






