నైట్‌క్లబ్ గొడవ ఎఫెక్ట్.. కెప్టెన్సీ నుంచి బెన్ స్టోక్స్ అవుట్

by Kema Shiva Kumar |

లండన్ నైట్‌క్లబ్ వివాదం, కర్ఫ్యూ ఉల్లంఘన కారణంగా ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను న్యూజిలాండ్‌తో జరిగే రెండో టెస్ట్ నుంచి ఈసీబీ తప్పించింది.

నైట్‌క్లబ్ గొడవ ఎఫెక్ట్.. కెప్టెన్సీ నుంచి బెన్ స్టోక్స్ అవుట్
X

దిశ, వెబ్‌డెస్క్: న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో ఘనవిజయం సాధించిన కొద్ది గంటల్లోనే ఇంగ్లాండ్ (England) క్రికెట్ జట్టు తీవ్ర వివాదంలో కూరుకుపోయింది. లండన్‌లోని ఒక నైట్‌క్లబ్‌లో జరిగిన గొడవ, జట్టు నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో ఇంగ్లాండ్ రెగ్యులర్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ (Ben Stokes)పై ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) కఠిన చర్యలు తీసుకుంది. జూన్ 17 నుంచి ఓవల్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరగబోయే రెండో టెస్ట్ మ్యాచ్ స్క్వాడ్ నుంచి కెప్టెన్ బెన్ స్టోక్స్, ఫాస్ట్ బౌలర్ గస్ అట్కిన్సన్‌లను ఈసీబీ తప్పించింది. అయితే, స్టోక్స్ అందుబాటులో లేకపోవడంతో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ జో రూట్ జట్టుకు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.

అతడే కెప్టెన్‌గా ఎందుకు..

ప్రస్తుతం ఇంగ్లాండ్ టెస్ట్ జట్టుకు హ్యారీ బ్రూక్ (Harry Brook) వైస్ కెప్టెన్‌గా ఉన్నప్పటికీ, అతడికి కాకుండా జో రూట్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించడం గమనార్హం. గతంలో న్యూజిలాండ్ పర్యటనలో హ్యారీ బ్రూక్ కూడా ఇలాగే ఓ నైట్‌క్లబ్ బౌన్సర్‌తో గొడవపడి భారీ జరిమానాను ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో మళ్లీ వివాదాలు రాకూడదనే ఉద్దేశంతో అనుభవజ్ఞుడైన జో రూట్‌ వైపు ఈసీబీ మొగ్గు చూపింది. రూట్ గతంలో రికార్డు స్థాయిలో 64 టెస్టుల్లో ఇంగ్లాండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2022 లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రూట్ దాదాపు నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఇంగ్లాండ్‌ను నడిపించబోతున్నాడు. లండన్ నైట్‌క్లబ్ వివాదం నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన బెన్ స్టోక్స్ టెస్ట్ కెప్టెన్సీకి రాజీనామా చేయడమే కాకుండా, అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచనలో ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. రెండో టెస్టులో స్టోక్స్, అట్కిన్సన్‌ల స్థానంలో స్టార్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్, బ్యాటర్ జోర్డాన్ కాక్స్‌లను జట్టులోకి తీసుకున్నారు.

Next Story