మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్ట్.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-10 16:49:48  IST  )

మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ విషయం తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్ట్.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్
X

దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ తరఫున రాజ్యసభ బరిలో నిలిచిన మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) నామినేషన్‌ను అక్కడి రిటర్నింగ్ అధికారి తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకున్నది. రిటర్నింగ్ అధికారి నిర్ణయాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే విచారణ తేదీపై రిజిస్ట్రీ నుంచి ఎలాంటి సమాచారం వెలువడలేదు.

అయితే, కాంగ్రెస్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి (Abhishek Manu Singhvi) ఎన్నికల సంఘం, కోర్టుల ఎదుట బలమైన వాదనలను వినిపించబోతున్నారు. మీనాక్షి నటరాజన్‌పై ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. కోర్టు కూడా ఆ కేసును ఇంకా విచారణకు స్వీకరించలేదని క్లారిటీ ఇచ్చారు. ఆమెకు కోర్టు పంపింది ప్రాథమిక విచారణ నోటీసు మాత్రమేనని తెలిపారు. ప్రజాప్రాతినిధ్య చట్టం‌లోని సెక్షన్ 33A ప్రకారం.. ఓ అభ్యర్థి తనపై ఉన్న కేసులను అఫిడవిట్‌లో కోర్టు సదరు కేసును స్వీకరించి, కనీసం 2 శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్ల కింద చార్జీలు (Charges) ఫ్రేమ్ చేసినప్పుడు మాత్రమే మెన్షన్ చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. మీనాక్షి విషయంలో ఆ రెండు జరగలేదు కాబట్టి, ఆమె అఫిడవిట్‌లో ఆ నోటీసు గురించి రాయాల్సిన అవసరం లేదని, రిటర్నింగ్ అధికారి చట్టాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని అభిషేక్ మను సింఘ్వి సుప్రీం కోర్టులో వాదనలు వినిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

Next Story