సైబర్ మోసగాళ్ల కంపెనీలో చిక్కుకున్న వందలాది ఏపీ యువత

by Muthe.Rajitha |

సోషల్ మీడియా ప్రకటనలను నమ్మి విదేశాల్లో మంచి ఉద్యోగం సాధించవచ్చని భావించిన తెలుగు రాష్ట్రాల యువత తీవ్ర మోసానికి గురై సైబర్ ముఠా చేతుల్లో చిక్కుకున్నారు.

సైబర్ మోసగాళ్ల కంపెనీలో చిక్కుకున్న వందలాది ఏపీ యువత
X

దిశ, వైవీబీ డెస్క్ : సోషల్ మీడియా ప్రకటనలను నమ్మి విదేశాల్లో మంచి ఉద్యోగం సాధించవచ్చని భావించిన తెలుగు రాష్ట్రాల యువత తీవ్ర మోసానికి గురై సైబర్ ముఠా చేతుల్లో చిక్కుకున్నారు. సింగపూర్‌లో ఐటీ ఉద్యోగాలు ఇప్పిస్తామని, నెలకు రూ.1.25 లక్షల వరకు భారీ వేతనం ఇస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ప్రకటనలను నమ్మి ఆశపడి వెళ్లిన దాదాపు వందమంది తెలుగు యువకులు ప్రస్తుతం అక్కడ తీవ్ర నరకయాతన అనుభవిస్తున్నారు. బాధితుల్లో గుంటూరు జిల్లా మంగళగిరి-తాడేపల్లి, కృష్ణా జిల్లా అవనిగడ్డ, శ్రీకాకుళం జిల్లా పలాసతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన పలువురు నిరుద్యోగులు ఉన్నారు.

అక్కడికి చేరుకున్న వెంటనే సదరు సైబర్ ముఠా సభ్యులు యువకుల వద్ద ఉన్న పాస్‌పోర్టులు, ఇతర కీలక ధృవీకరణ పత్రాలను బలవంతంగా స్వాధీనం చేసుకుని వారిని రహస్య ప్రాంతంలో నిర్బంధించారు. తాము చెప్పినట్లుగా సైబర్ నేరాలకు పాల్పడాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరిస్తూ వారిపై ఒత్తిడి తెచ్చారు. పారిపోవడానికి ప్రయత్నించిన వారికి కరెంటు షాక్ ఇవ్వడ, చీకటి గదుల్లో ఆహారం ఇవ్వకుండా రోజుల తరబడి బంధించడం, యువతులపై లైంగిక దాడికి పాల్పడుతున్నట్టు సమాచారం. అయితే, బాధితులు అత్యంత చాకచక్యంగా ఫోన్ల ద్వారా ఇక్కడి తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు సమాచారం అందించారు.

దీంతో అప్రమత్తమైన బాధితుల బంధువులు జులై 17న కేంద్ర విదేశాంగ శాఖకు ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేశారు. అనంతరం జులై 22న ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS) విభాగానికి కూడా ఫిర్యాదు చేయడంతో అధికారులు తక్షణమే స్పందించారు. విదేశాల్లో చిక్కుకున్న తెలుగు యువకులను సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు చర్యలు చేపడుతున్నామని ఏపీఎన్‌ఆర్‌టీ ప్రతినిధులు బాధితుల కుటుంబాలకు భరోసా ఇచ్చారు.

Next Story