- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ లబ్ధిదారులకు తీపికబురు: ‘స్మార్ట్ రేషన్ కార్డులు’ వచ్చేస్తున్నాయ్!
తెలంగాణలో ఉచిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి సర్వం సిద్ధమైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది. రెండు మూడు రోజుల్లో లబ్ధిదారులకు అందజేసేందుకు పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. ఆగస్టులో మూడు నెలల రేషన్ఇస్తుండటంతో నాలుగైదు రోజుల ముందుగానే కార్డుల పంపిణీ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్లకుపైగా కుటుంబాల కోసం క్యూఆర్ కోడ్‌తో రూపొందించిన రేషన్ కార్డుల ముద్రణ పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ కొత్త కార్డులను ఆయా జిల్లాలకు అధికార యంత్రాంగం చేరవేసింది. కార్డుల పంపిణీ తేదీని సీఎం రేవంత్ రెడ్డి ఖరారు చేయడమే తరువాయి అని అధికారులు పేర్కొన్నారు. సీఎం ఖరారు చేసిన తేదీ నుంచి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్టు పౌర సరఫరాల శాఖ వర్గాలు చెబుతున్నాయి.
గ్రేటర్‌లో శ్రీకారం..
గ్రేటర్‌నగరంలో ముందుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొత్త రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. అదే సమయంలో రాష్ట్రంలోని119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల చేతుల మీదుగా లబ్ధిదారులకు కొత్త కార్డులు అందజేసేలా పౌరసరఫరాల శాఖ సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది. కొత్త రేషన్ స్మార్ట్ కార్డులు క్రెడిట్, డెబిట్ కార్డు సైజులో ఉంటాయి. ఫొటోపై కార్డు యజమాని పేరు, చిరునామాలు ఉంటాయి. సీఎం రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలను కార్డుపై ముద్రించినట్టు అధికారులు వెల్లడించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా కొత్త రేషన్ కార్డులు ఇలా స్మార్ట్ కార్డు రూపంలో అందించనున్నారు. కార్డుపై క్యూఆర్ కోడ్ ప్రింటింగ్ చేసి ఉంటుంది. ఆ కోడ్‌ను స్కాన్ చేస్తే రేషన్ లబ్ధిదారులైన ఆ కుటుంబ సభ్యుల వివరాలతో పాటు ఇప్పటి వరకు బియ్యం, చక్కెర, గోధుమలు వంటి రేషన్ వస్తువుల్ని తీసుకున్న పూర్తి వివరాలు కనిపిస్తాయి.
నకిలీలకు ముకుతాడు..
పౌరసరఫరాలశాఖకు అందించే కొత్త స్మార్ట్ కార్డులపై క్యూఆర్ కోడ్ ఉండడంతో నకిలీ కార్డుల జారీకి అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది. ఈ- స్మార్ట్ కార్డులను పీవీసీ మెటీరియల్‌తో తయారు చేస్తారు. ఇది సాధారణ కాగితపు లేదా లామినేషన్ కార్డుల కంటే ఎక్కువ కాలం మన్నికగా ఉంటా యి. కార్డులోని వివరాలను అధికారులు సులభంగా ధ్రువీకరించే అవకాశం ఉన్నది. భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాలతో అనుసంధానం చేయడానికి ఈ- స్మార్ట్ కార్డులు ఎంతో ఉపయోగపడతాయి. ప్రస్తుతం రేషన్ దుకాణాల్లో వివరాలు తప్పుగా నమోదు కావడంతో కొంత మంది లబ్ధిదారులకు రేషన్ సరకుల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. స్మార్ట్ కార్డులతో ఇలాంటి పరిస్థితి ఉండదని అధికారులు చెబుతున్నారు. ఒకే కుటుంబానికి ఒకే కార్డు ఉండడంతోపాటు తప్పుడు వివరాలతో ప్రయోజనం పొందే అవకాశం ఉండదు. క్యూఆర్ కోడ్ ఆధారంగా ధ్రువీకరణ సులువు కావడంతో పాటు రేషన్ పంపిణీలో పారదర్శకత ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. సాంకేతిక పరి జ్ఞానంతో నాణ్యమైన సేవలు అందించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
స్మార్ట్ కార్డుల ప్రయోజనాలు..
స్మార్ట్రేషన్కార్డు కేవలం సన్నబియ్యం పంపిణీకే కాకుండా భవిష్యత్తులో వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అమలు చేయనున్నట్టు తెలుస్తోంది. కుటుంబ వివరాల ధ్రువీకరణ, ప్రభుత్వ సేవల వినియోగం, లబ్ధిదారుల గుర్తింపు వంటి అవసరాలకు ఈ- కార్డులు ఉపయోగపడేలా ప్రభుత్వం రూపొందించింది. దీంతో ఒకే కార్డు ద్వారా పలు రకాల ప్రయోజనాలు పొందవచ్చు. లబ్ధిదారుడు దుకాణానికి వెళ్లి డీలరుకు కార్డు ఇస్తే తన వద్ద ఉన్న ఈపాస్యంత్రంలో స్కాన్చేస్తారు. అందులో లబ్ధిదారుల వివరాలతో పాటు ఇప్పటివరకు తీసుకున్న, తీసుకోవాల్సిన రేషన్సరకులు వివరాలు ఉంటాయి. కార్డు ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత మరింత పెరుగుతుంది.






