- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భరోసా బాధితులకా? నిందితుడికా? సూటిగా ప్రశ్నిస్తున్న బాధిత కుటుంబ సభ్యులు
చట్టం అధికార పార్టీ నేతలకు చుట్టంగా మారిందా? నిందితులకు భద్రత కల్పిస్తున్న చట్టం న్యాయం కోసం ఎదురుచూస్తున్న కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తోందా? అనే ప్రశ్నలు కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గ ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.

దిశ, కరీంనగర్ బ్యూరో: చట్టం అధికార పార్టీ నేతలకు చుట్టంగా మారిందా? నిందితులకు భద్రత కల్పిస్తున్న చట్టం న్యాయం కోసం ఎదురుచూస్తున్న కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తోందా? అనే ప్రశ్నలు కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గ ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతలకు దాసోహమన్నట్లు వ్యవహరించిన అధికారులు, ఆగమేఘాల మీద అక్రమ కేసులు నమోదు చేసిన పోలీసులు... ఆ కేసు నమోదుతో తీవ్ర మనస్తాపానికి గురైన మాజీ సర్పంచ్ భర్త అగ్నికి ఆహుతై, వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడి మృతి చెందాడు. అనంతరం నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, వారిని శిక్షిస్తామని హామీ ఇచ్చిన పోలీసులు అమలులో జాప్యం చేయడంతో బాధిత కుటుంబం నిందితుల అరెస్టుపై అనుమానం వ్యక్తం చేస్తోంది. బాధిత కుటుంబానికి భరోసా ఇవ్వాల్సిన పోలీసులు, నిందితులకు భద్రత కల్పించడం దేనికి సంకేతమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘భరోసా బాధితులకా? నిందితులకా?’ అని ప్రశ్నిస్తున్న పరిస్థితి ఆ నియోజకవర్గంలో ఆందోళన కలిగిస్తోంది.
పోలీసు చర్యలపై విమర్శలు
తప్పుడు కేసు నమోదు చేసి ఓ అమాయకుడి మృతికి కారకులైన ఎమ్మెల్యే పీఏ మురళీధర్ రెడ్డితో పాటు మరో నలుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, మూడు రోజులు గడిచినా నిందితులను అదుపులోకి తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో గుండ్లపల్లి గ్రామంలోని నిందితుల ఇంటి వద్ద పోలీసులు భద్రత కల్పించడం స్థానికుల్లో అనుమానాలకు తావిస్తోంది. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని నమ్మబలికిన పోలీసు అధికారులు, దహన సంస్కారాలు పూర్తయిన తర్వాత కూడా నిందితులపై చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తూ అధికార భక్తిని చాటుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. పీఏ మురళీధర్ రెడ్డి తన అధికార బలాన్ని ఉపయోగించి చర్యలు తీసుకోకుండా పోలీసులను ప్రభావితం చేయడంతో పాటు, ఇంటి వద్ద పోలీసు కావలి పెట్టించుకుని దర్పాన్ని ప్రదర్శిస్తున్నారని గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘చట్టం తన పని తాను చేస్తుంది’ అని చెప్పే పోలీసులు నిందితులను అరెస్టు చేయకుండా కాలయాపన చేయడం వల్ల బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
'న్యాయం చేస్తారా? మమ్మల్ని చంపేస్తారా?'
రాజేందర్ రెడ్డి మృతికి కారకులైన నిందితులను అరెస్టు చేస్తారా? లేక క్యాంపు కార్యాలయం ముందు మమ్మల్ని కూడా చనిపోవాలని చెబుతున్నారా? అంటూ బాధిత కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో, పోస్టుమార్టం అనంతరం నిందితులను అరెస్టు చేస్తామని హామీ ఇచ్చిన పోలీసులు ఇప్పుడు అధికార పార్టీ నేతలకు తలొగ్గి వెనక్కు తగ్గారా? అని ప్రశ్నించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సామాన్యులపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేసి, వారి మృతికి కారణమైన వ్యక్తికి భద్రత కల్పించడం దేనికి సంకేతమని వారు ప్రశ్నిస్తున్నారు.
అధికార పార్టీలో కలకలం
అక్రమ కేసు నమోదు చేయించి ఓ వ్యక్తి మృతికి కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు, ఎమ్మెల్యే కార్యక్రమాల షెడ్యూల్‌ను పార్టీ గ్రూపుల్లో పోస్టు చేయడం అధికార పార్టీలో చర్చనీయాంశమైంది.ఒకవైపు బాధిత కుటుంబం, గ్రామస్తులు సదరు పీఏపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతమవుతుండగా మరోవైపు అదే కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి నియోజకవర్గ పర్యటనల వివరాలను పార్టీ గ్రూపుల్లో పోస్టు చేయడం స్థానికంగా వ్యతిరేకతకు దారితీస్తోందని పార్టీ నాయకులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న వ్యక్తితో స్థానిక శాసనసభ్యుడి అధికారిక కార్యక్రమాలను ప్రచారం చేయించడం, ఇంకా అతడిని వ్యక్తిగత సహాయకుడిగా కొనసాగించడం వెనుక ఏదో పెద్ద కారణం ఉందనే చర్చ నియోజకవర్గంలో సాగుతోంది.






