- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాల్కొండ కాంగ్రెస్‌లో శృతిమించిన ఆధిపత్య పోరు
బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్‌లో నేతల ఆధిపత్య పోరుతో అంతర్గత విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. ఇన్‌చార్జి సునీల్ కుమార్ రెడ్డి ఒకవైపు, అనిల్ ఈరవత్రి - మానాల మోహన్ రెడ్డి వర్గం మరోవైపుగా విడిపోయారు.

బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్‌లో నేతల ఆధిపత్య పోరుతో అంతర్గత విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. ఇన్‌చార్జి సునీల్ కుమార్ రెడ్డి ఒకవైపు, అనిల్ ఈరవత్రి - మానాల మోహన్ రెడ్డి వర్గం మరోవైపుగా విడిపోయారు. భీమ్‌గల్ మండల అధ్యక్షుడి నియామక వివాదం నియోజకవర్గ కాంగ్రెస్‌లో వర్గపోరుకు మరింత ఆజ్యం పోసింది. కార్యకర్తలు, అధికారులపై నిఘా పెట్టేందుకు నాయకులు మండలాల వారీగా సీక్రెట్ ఇన్ఫార్మర్లను ఏర్పాటు చేసుకున్నారు. నేతల ఒత్తిళ్లు, ఆదేశాల నడుమ ఎవరి మాట వినాలో తెలియక అధికారులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. నేతల మధ్య విభేదాల వల్ల అభివృద్ధి పనులు నిలిచిపోతుండడంతో కాంగ్రెస్ అధిష్ఠానం తక్షణమే జోక్యం చేసుకోవాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.
- దిశ ప్రతినిధి, నిజామాబాద్
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : బాల్కొండ నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఒకే పార్టీకి చెందిన కీలక నేతల మధ్య ఆధిపత్య పోరు బహిరంగంగానే సాగుతుండడంతో కిందిస్థాయి నాయకత్వమే కాకుండా ప్రభుత్వ అధికారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కంటే గ్రూపు రాజకీయాలు, స్వపక్ష నేతలపై ఆధిపత్యానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సునీల్ వర్సెస్ అనిల్, మోహన్‌రెడ్డి..
నియోజకవర్గంలో రాజకీయం ‘సునీల్ వర్సెస్ అనిల్’ అన్న రీతిలో సాగుతోంది. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి, టీజీఎండీసీ చైర్మన్ అనిల్ ఈరవత్రి తమ ఆధిపత్యం కోసం ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ భీమ్‌గల్ మండల అధ్యక్షుడిగా తన అనుచరుడు మల్లెల లక్ష్మణ్‌ను సునీల్ రెడ్డి నియమించడం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. కార్యకర్తలు పెద్దఎత్తున ఆందోళనలు చేసినా సునీల్ వెనక్కి తగ్గకపోవడంతో అక్కడ విభేదాలు నివురుగప్పిన నిప్పులా మారాయి. మరోవైపు రానున్న ఎన్నికల నాటికి కేడర్‌ను తమవైపు తిప్పుకునేందుకు ప్రతి మండలంలో రహస్య వేగుల (సీక్రెట్ ఇన్ఫార్మర్లు) ద్వారా నిఘా ఉంచడం గమనార్హం. ఇక రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డికి సొంత కేడర్ ఉన్నప్పటికీ, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అనిల్ ఈరవత్రితో కలిసి ఒకే వర్గంగా పనిచేస్తున్నారు. అయితే మోహన్ రెడ్డి కూడా తన కార్యక్రమాలకు రాని కార్యకర్తలను బెదిరింపు ధోరణిలో ప్రశ్నిస్తూ తన హవా నడిపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో జెండా ఒకటే అయినా క్షేత్రస్థాయిలో ఈ ముగ్గురు నేతల అనుచరులు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
అధికారులకు ‘త్రిశంకు’ స్వర్గం...
ఏ ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించాలన్నా అధికారులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఒక వర్గం చెప్పినట్లు చేస్తే మరో వర్గం నుంచి ఇబ్బందులు వస్తున్నాయని పలువురు అధికారులు వాపోతున్నారు. ఆఫీసులకు వచ్చే నాయకుల్లో ఎవరు ఏ వర్గానికి చెందినవారో తెలియక మాట్లాడే మాటలు చిక్కులు తెచ్చిపెడుతున్నాయని ఓ మండల అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశాంతమైన వాతావరణాన్ని హస్తం పార్టీ నేతల పోరు భ్రష్టు పట్టిస్తోందని, కొందరైతే ఈ వేధింపులు తట్టుకోలేక ‘లాంగ్ లీవ్ పెట్టి వెళ్లిపోవడమే మేలు’ అనే తీవ్ర అసహనానికి గురవుతున్నారు.
అభివృద్ధిపై ప్రభావం.. అధిష్ఠానం జోక్యం అవసరం
నాయకుల పోరు వల్ల ఏ గ్రామంలో అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవాలు జరపాలన్నా వివాదాలు తలెత్తుతుండడంతో నిర్ణయాలు ఆలస్యమవుతున్నాయి. నాయకుల మధ్య సమన్వయం లేక కార్యకర్తలు సైతం సందిగ్ధంలో పడ్డారు. ఇప్పటికైనా పార్టీ అధిష్ఠానం వెంటనే జోక్యం చేసుకుని నేతల మధ్య స్పష్టమైన బాధ్యతలు కేటాయించకపోతే పార్టీకి తీవ్ర నష్టం తప్పదని కాంగ్రెస్ శ్రేణులు హెచ్చరిస్తున్నాయి.






