సీడ్ రైతులను పట్టించుకోరా? వ్యాపారుల చుట్టూ మూడు నెలలుగా అన్నదాతల ప్రదక్షిణలు

by Ajay Maddhiboyina |

'రైతే దేశానికి వెన్నెముక.. అన్నదాత రక్షణే మా ధ్యేయం' అంటూ పాలకుల నుంచి స్థానిక నాయకుల వరకు వేదికలపై ఇచ్చే ఉపన్యాసాలు మాటలకే పరిమితమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో మాత్రం చెమటోడ్చి వరి ధాన్యాన్ని పండించిన నిరుపేద రైతులను సీడ్ వ్యాపారులు నిలువునా దోపిడీ చేయడానికి పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.

సీడ్ రైతులను పట్టించుకోరా? వ్యాపారుల చుట్టూ మూడు నెలలుగా అన్నదాతల ప్రదక్షిణలు
X

దిశ, హుజూరాబాద్ రూరల్: 'రైతే దేశానికి వెన్నెముక.. అన్నదాత రక్షణే మా ధ్యేయం' అంటూ పాలకుల నుంచి స్థానిక నాయకుల వరకు వేదికలపై ఇచ్చే ఉపన్యాసాలు మాటలకే పరిమితమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో మాత్రం చెమటోడ్చి వరి ధాన్యాన్ని పండించిన నిరుపేద రైతులను సీడ్ వ్యాపారులు నిలువునా దోపిడీ చేయడానికి పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో సీడ్ వరి సాగు చేసిన రైతుల ధాన్యం మిల్లులకు చేరి మూడు నెలలు గడుస్తున్నా, నేటికీ పైసా చెల్లించకుండా వ్యాపారులు మాయమాటలతో కాలయాపన చేస్తుండటం స్థానికంగా తీవ్ర దుమారం రేపుతోంది.

అడ్డగోలు కోతలు.. 'సిండికేట్' దాష్టీకం..

గత కొన్నేళ్లుగా సీడ్ వ్యాపారం పేరుతో వందల కోట్లు ఆర్జించి, ఆధునిక మిల్లులు, బహుళ అంతస్తుల గోదాములు నిర్మించుకున్న సదరు వ్యాపారులు నేడు 'నష్టాల' నాటకానికి తెరలేపారు. నియోజకవర్గంలోని వ్యాపారులంతా ఏకమై 'సిండికేట్'గా ఏర్పడి రైతుల కడుపు కొట్టేందుకు కుట్ర పన్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే తూకం సమయంలోనే క్వింటాలుకు మూడు నుంచి నాలుగు కిలోల వరకు కోత విధించారు. ముందస్తు ఒప్పందాలకు తిలోదకాలు ఇస్తూ, ఇప్పుడు క్వింటాలుకు ఏకంగా రూ.100 చొప్పున కోత విధించేందుకు అడ్డగోలు నిబంధనలు రుద్దుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 2,000 ఎకరాల్లో సీడ్ వరి పండించిన వేలాది మంది రైతులు ఈ అక్రమ కోతల వల్ల ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. "గతంలో కోట్లాది రూపాయల లాభాలు వచ్చినప్పుడు రైతులకు అదనంగా ఒక్క రూపాయి కూడా పంచివ్వని ఈ వ్యాపారులు, ఇప్పుడు లేని నష్టాలను బూచిగా చూపి మా నోటికాడి కూడును లాక్కోవాలని చూస్తే ఊరుకునేది లేదు" అని అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నాయకులు, అధికారుల 'మామూళ్ల' మౌనం?

రైతుల కష్టార్జితాన్ని అడ్డగోలుగా దోచుకుంటున్న సీడ్ వ్యాపారుల అరాచకాలను అరికట్టాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు కనీసం పట్టించుకోకపోవడం వెనుక పెద్ద ఎత్తున 'మామూళ్ల' పర్వం నడిచిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ప్రజాప్రతినిధులు, అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు సైతం వ్యాపారులతో కుమ్మక్కై నోళ్లు మూసుకున్నారని, తమ ఆవేదనను విన్నవించేందుకు వెళ్తే బుట్టదాఖలు చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అలసత్వం, నాయకుల స్వార్థపూరిత వైఖరి వ్యాపారుల అక్రమాలకు మరింత బలమిస్తోందని వాపోతున్నారు.

రైస్ మిల్లులకు విక్రయిస్తున్న సీడ్ వ్యాపారులు..

ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడంతో పాటు స్థానిక రైస్ మిల్లులకు కూడా సీడ్ ధాన్యాన్ని వ్యాపారులు విక్రయిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. "మా ధాన్యం అమ్ముడుపోవడం లేదని సాకులు చెబుతూనే, ఇతర రాష్ట్రాలు, రైస్ మిల్లులకు యథావిధిగా విక్రయిస్తున్నారు. అధికారులు సీడ్ మిల్లులను తనిఖీ చేసి స్టాకును పరిశీలించాలి" అని వారు డిమాండ్ చేస్తున్నారు.

మిల్లుల్లో సీడ్ ధాన్యం ఒక్క గింజ కూడా లేదని చెప్పి వ్యాపారులు తప్పించుకునేందుకు సాకులు చెబుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

అంబేడ్కర్ చౌరస్తాలో టెంట్ వేసి ధర్నా చేస్తాం..

వేమారెడ్డి, రైతు, సిర్సపల్లి

‘వ్యాపారుల దగాపై త్వరలోనే హుజూరాబాద్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో టెంట్ వేసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. ముందస్తు ఒప్పందం ప్రకారం మాకు రావాల్సిన పూర్తి డబ్బులు చెల్లించే వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తాం. అధికారులు ఇప్పటికైనా స్పందించి సీడ్ సిండికేట్ దోపిడీకి అడ్డుకట్ట వేయాలి.’

అప్పులు ఇచ్చిన వారు ఇబ్బంది పెడుతున్నారు..

సమ్మిరెడ్డి, రైతు

‘సీడ్ వరి ధాన్యం పండించిన రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. సీడ్ వ్యాపారులు సిండికేట్‌గా మారి మూడు నెలలు గడిచినా నేటికీ డబ్బులు చెల్లించలేదు. అప్పులు ఇచ్చిన వారు రైతుల ఇళ్లకు వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. డబ్బులు ఇవ్వమంటే వ్యాపారులు మాయమాటలు చెబుతున్నారు.’

ఆత్మహత్యలు చేసుకుంటేనే పట్టించుకుంటారా..?

ముచ్చ సమ్మిరెడ్డి, రైతు నాయకుడు, దమ్మక్కపేట

‘సీడ్ వరి ధాన్యం పండించి డబ్బుల కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నాం. వ్యాపారులు సిండికేట్‌గా మారి డబ్బులు ఇవ్వకుండా చెప్పులు అరిగేలా తిప్పిస్తున్నారు. అప్పులిచ్చిన వారు వేధిస్తున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటేనే అధికారులు, నాయకులు పట్టించుకుంటారా?’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story