- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రంగారెడ్డి జిల్లాలో 2 లక్షలకు పైగా ఓట్ల ఏరివేత!
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో స్లో..గా నడుస్తోంది.

దిశ, రంగారెడ్డి బ్యూరో: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో స్లో..గా నడుస్తోంది. పల్లె ప్రాంతాల్లో పుంజుకున్నప్పటికీ పట్టణ ప్రాంతాల్లో మాత్రం నెమ్మదిగా సాగుతోంది. చిరునామాలు మారడం, పట్టణాల్లో ఓటు హక్కు ఉన్నవారికి గ్రామాల్లోనూ ఉండడం వంటి కారణాలతో సర్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. బీఎల్ వోలు ఇంటింటికీ వెళ్లి ఆరా తీస్తున్నా.. కొందరి ఓటర్ల వివరాల ఆచూకీ లభించడం లేదు. ఇది పెద్ద సమస్యగా మారింది. అయితే డబుల్ ఓట్లు ఉన్నవారు పట్టణాల్లో ఓటును వదిలించుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే వారు స్వగ్రామాల్లో ఎన్యూమరేషన్ పత్రాలను తీసుకున్నారు. దీంతో వారు తిరిగి బిఎల్ వోలకు పత్రాలను సమర్పించడం లేదు. మృతుల పేరుతో ఉన్న ఓట్లను బూత్ లెవెల్ అధికారులు తొలగిస్తున్నారు. ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉంటే గుర్తిస్తున్నారు. శాశ్వతంగా గ్రామాలను వదిలి వెళ్లిన జాబితాను తయారు చేస్తున్నారు. వడబోతలో జిల్లాలో వేల సంఖ్యలో ఉన్న బోగస్ ఓట్ల లెక్క సైతం తేలనుంది. ఈ లెక్కన.. జిల్లాలో మొత్తంగా 2 లక్షలకు పైగా ఓట్లు ఏరివేతకు గురయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
జిల్లాలో మొత్తం ఓట్లు 36,99,743
డిజిటలైజేషన్ పూర్తి 21,82,638
బిఎల్ వోలకు ఇంకా అందని ఫారాలు 2,48,350
ఇప్పటివరకు గుర్తించిన డెత్ ఓట్లు 4,181
గుర్తించిన వలస, డూప్లికేట్ ఓట్లు 20,934
జిల్లాలో ఇదీ పరిస్థితి..
- రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా డిజిటలైజేషన్ ప్రక్రియ ఈనెల 25 సాయంత్రం 4 గంటల వరకు 58.99 శాతమే పూర్తయింది. షాద్ నగర్, కల్వకుర్తి, చేవెళ్ల నియోజకవర్గాల పరిధిలో ఫర్వా లేదనుకున్నా.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 67.34శాతం, రాజేంద్ర నగర్(53.22 శాతం), శేరిలింగంపల్లి(52.37 శాతం), మహేశ్వరం(51.57 శాతం) మాత్రమే డిజిటలైజేషన్ పూర్తయింది. ఎల్బీనగర్ నియోజకవర్గంలో కేవలం 47.88 శాతమే పూర్తయింది. 8 నియోజకవర్గాల పరిధిలో 12,68,755 ఫారాలను డిజిటలైజేషన్ చేయాల్సి ఉంది.
- ఓటర్ల నుంచి ఇంకా 2,48,35(6.71శాతం) ఫారాలు బీఎల్ వోలకు అందాల్సి ఉంది. అత్యధికంగా మహేశ్వరం నియోజకవర్గంలో 49,065(8.54 శాతం ), చేవెళ్ల నియోజకవర్గంలో 33,441(12.21 శాతం))ఫారాలను నింపిన తర్వాత బీఎల్ వోలకు తిరిగి ఇవ్వలేదు. ఇబ్రహీంపట్నం పరిధిలో 28,543(8.28 శాతం), ఎల్బీనగర్ పరిధిలో 37,392(6.15 శాతం), రాజేంద్ర నగర్ పరిధిలో 32,672(5.14 శాతం) , శేరిలింగంపల్లి 33,268(,4.3 శాతం), కల్వకుర్తి 14,470(5.9 శాతం), షాద్ నగర్ 19,499(7.96 శాతం) ఫారాలు బీఎల్ వోలకు అందాల్సి ఉంది.
- బీఎల్ వోలకు అందిన వాటిలో ఇంకా 6,032 ఫారాల వెరిఫికేషన్ వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉంది.
- మహేశ్వరం నియోజకవర్గంలోని 22 పోలింగ్ కేంద్రాల పరిధిలో డిజిటలైజేషన్ ప్రక్రియ 30 శాతం లోపే పూర్తయింది. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని 68 కేంద్రాల పరిధిలో, మహేశ్వరంలోని 165 కేంద్రాలలో, రాజేంద్ర నగర్ లోని 53 కేంద్రాలలో 40శాతమే పూర్తయింది. ఇబ్రహీంపట్నం(69), ఎల్బీనగర్(366), మహేశ్వరం(300), రాజేంద్ర నగర్(207), శేరిలింగంపల్లి(177), చేవెళ్ల(3), షాద్ నగర్(5) కలిపి మొత్తం 1,127 కేంద్రాలలో 50శాతం మాత్రమే డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయింది.
- డెత్, వలస ఓటర్లు, డూప్లికేట్ కలిపి మొత్తం 25,115 ఓట్లను అధికారులు గుర్తించారు. షాద్‌నగర్ మినహా ఇతర అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ తరహా ఓట్లు ఎక్కువగానే ఉన్నాయి. వీటిని ఒకసారి పరిశీలించాక ఓటరు జాబితా నుంచి తొలగించనున్నారు.
మిగిలింది తొమ్మిది రోజులే!
ఎన్యూమరేషన్ ఫారాలను నింపి బీఎల్ వోలకు అందజేసేందుకు ఈనెల 24వ తేదీ నాటికే గడువు పెట్టినప్పటికీ ఎన్నికల సంఘం ఆగస్టు 3వ తేదీకి పెంచింది. దీంతో ఇంకా తొమ్మిది రోజులే ఉండటంతో అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు పెడుతోంది. ఓటరు ఎన్యూమరేషన్ ఫారం తీసుకుని దానిని నింపిన తర్వాత బీఎల్ వోలకు సమర్పించకుంటే ఓటు గల్లంతేనని అధికారులు చెబుతున్నారు. ఆగస్టు 3న ముసాయిదా(డ్రాఫ్ట్) విడుదల చేయనున్నారు. తర్వాత నెల రోజులు అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరించాక తుది జాబితాను వెల్లడిస్తారు.






