- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహారాష్ట్రలో మళ్లీ మావోయిస్టుల కదలికలు: గడ్చిరోలి బంద్‌కు పిలుపు
గడ్చిరోలి జిల్లా భామ్రాగడ్‌లో మావోయిస్టుల పోస్టర్లు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న మహారాష్ట్రలోని గడ్చిరోలి (Gadchiroli) ఏజెన్సీ ప్రాంతంలో మళ్లీ మావోయిస్టుల కదలికలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. జిల్లాలోని భామ్రాగడ్ (Bhamragad) తాలూకా పరిధిలోని పలు ప్రధాన రహదారులు, ప్రభుత్వ భవనాల వద్ద మావోయిస్టులు వేసిన పోస్టర్లు ప్రత్యక్షం కావడంతో స్థానిక ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ఆదివాసీల ‘జల్, జంగల్, జమీన్’ హక్కుల పరిరక్షణ, పలు స్థానిక సమస్యలపై నిరసనగా మావోయిస్టుల ఉత్తర గడ్చిరోలి డివిజన్ కమిటీ ఈ పోస్టర్లను విడుదల చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ జూలై 30 వరకు గడ్చిరోలి జిల్లా వ్యాప్తంగా బంద్ పాటించాలని ప్రజలకు, వ్యాపారులకు పిలుపునిచ్చారు. అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని రవాణా, వ్యాపార సముదాయాలు మూసివేయాలని ఆ పోస్టర్లలో పేర్కొన్నారు.
భద్రతా దళాలు అలర్ట్.. కూంబింగ్ తీవ్రతరం
అయితే, మావోయిస్టుల బంద్ పిలుపు, పోస్టర్ల లభ్యంపై స్పందించిన గడ్చిరోలి పోలీసులు, సీ-60 (C-60) కమాండో దళాలు తక్షణమే రంగంలోకి దిగాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి దాడులకు తావులేకుండా ఉండేందుకు సరిహద్దు ప్రాంతాల్లో అదనపు భద్రతా బలగాలను మోహరించారు. భామ్రాగడ్, ఏటపల్లి, అహేరి అటవీ ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా దళాలు విసృతంగా కూంబింగ్ చర్యలు చేపట్టాయి. బంద్‌కు సంబంధించి ప్రజలు ఎలాంటి పుకార్లను నమ్మవద్దని, భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, ఏజెన్సీ ప్రాంతంలో పరిస్థితి పూర్తి పోలీసుల నియంత్రణలోనే ఉందని ఉన్నతాధికారులు వెల్లడించారు. సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల వద్ద వాహనాల తనిఖీలను మరింత కఠినతరం చేశారు.






