కోదాడ బైపాస్‌పై భయానక ప్రమాదం.. పల్టీలు కొట్టి తగలబడ్డ కారు, ఐదుగురు సురక్షితం!

by Jakkula.Mamatha |

సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్‌పై ఆదివారం ఉదయం భయానక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

కోదాడ బైపాస్‌పై భయానక ప్రమాదం.. పల్టీలు కొట్టి తగలబడ్డ కారు, ఐదుగురు సురక్షితం!
X

దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్‌పై ఆదివారం ఉదయం భయానక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన ఓ మారుతి స్విఫ్ట్ డిజైర్ కారు డివైడర్‌ను బలంగా ఢీకొని పల్టీలు కొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అసాధారణ సమయస్ఫూర్తి ప్రదర్శించి కారులో చిక్కుకున్న ఐదుగురిని సురక్షితంగా బయటకు తీసుకురావడంతో పెను విషాదం తృటిలో తప్పింది. వారు బయటకు వచ్చిన కొద్ది క్షణాల్లోనే సీఏన్‌జీ గ్యాస్ లీక్ కావడంతో కారు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది.పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..విజయవాడకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు మారుతి స్విఫ్ట్ డిజైర్ కారులో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి బయలుదేరారు.

కోదాడ బైపాస్‌కు చేరుకున్న సమయంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కారు వేగంగా వెళ్లి డివైడర్‌ను ఢీకొట్టింది. ఢీకొన్న ప్రభావంతో కారు పలుమార్లు పల్టీలు కొట్టి రోడ్డుపక్కన ఆగిపోయింది.ఈ దృశ్యాన్ని గమనించిన స్థానికులు ఎలాంటి భయం లేకుండా వెంటనే ప్రమాద స్థలానికి పరుగెత్తారు. కారులో చిక్కుకున్న ప్రయాణికులను అత్యంత చాకచక్యంగా బయటకు తీసుకువచ్చారు. స్థానికులు అందరినీ రక్షించిన కొద్ది క్షణాల్లోనే కారులోని సీఏన్‌జీ గ్యాస్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించి కారు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. దీంతో అక్కడ కొంతసేపు భయాందోళన నెలకొంది.

ఈ ప్రమాదంలో ఒకరికి స్వల్ప గాయాలు కాగా, వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన నలుగురు సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. స్థానికులు చూపిన అప్రమత్తత, సాహసోపేత చర్యల వల్ల ఐదుగురు ప్రాణాలతో బయటపడటం తో పెద్ద ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కొన్ని క్షణాలు ఆలస్యమై ఉంటే ఘోర విషాదం జరిగేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

Next Story