- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాకతీయ ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత.. శవానికే చికిత్స చేశారంటూ బంధువుల ఆందోళన!
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ మృతి చెందిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది.

దిశ,మేడిపల్లి: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ మృతి చెందిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. మహిళ ముందుగానే మృతి చెందినప్పటికీ ఆ విషయాన్ని దాచి పెట్టి చికిత్స కొనసాగిస్తున్నట్లు నమ్మించి డబ్బులు వసూలు చేశారని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం శేరిగూడెం గ్రామానికి చెందిన బొంత శోభ(42) ఈ నెల 20న గుండె సంబంధిత సమస్యతో కాకతీయ ఆస్పత్రిలో చేరారు. పరీక్షల అనంతరం గుండెలో స్టెంట్లు వేయాల్సి ఉందని వైద్యులు సూచించడంతో చికిత్స కోసం సుమారు రూ.4 లక్షలు చెల్లించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
శనివారం ఉదయం శోభ మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.అయితే, శోభ ముందుగానే మృతి చెందినప్పటికీ ఆ విషయాన్ని దాచిపెట్టి చికిత్స కొనసాగిస్తున్నట్లు నమ్మించి మందుల పేరుతో డబ్బులు వసూలు చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శోభ మృతి చెందిందని పేర్కొంటూ బంధువులు ఆస్పత్రి ఎదుట నిరసన చేపట్టారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
కాకతీయ ఆస్పత్రి వైద్యుడి వివరణ..
కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలను కాకతీయ ఆస్పత్రి యాజమాన్యం,వైద్యులు సంతోష్ ఖండించారు. బొంత శోభ తీవ్ర గుండెపోటు (కార్డియాక్ అరెస్ట్)తో అత్యవసర పరిస్థితిలో ఆస్పత్రికి వచ్చారని తెలిపింది. వెంటనే షాక్ థెరపీ (సీపీఆర్, డిఫిబ్రిలేషన్) ద్వారా గుండె స్పందనను పునరుద్ధరించి, ఐదు రోజుల పాటు వెంటిలేటర్‌పై నిపుణుల వైద్య బృందం నిరంతరం చికిత్స అందించిందని పేర్కొంది. అయినప్పటికీ మరోసారి గుండె స్పందన ఆగిపోవడంతో అన్ని విధాలుగా ప్రయత్నించినా ఆమెను కాపాడలేకపోయామని వివరించారు. అంతేకాక, చికిత్సకు సంబంధించిన ప్రతి దశకు సంబంధించిన వైద్య రికార్డులు తమ వద్ద ఉన్నాయని, కుటుంబ సభ్యులు చేస్తున్న "మరణం తర్వాత కూడా చికిత్స కొనసాగించి డబ్బులు వసూలు చేశారు" అనే ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఇంకా ఆస్పత్రికి సుమారు రూ.3 లక్షలకు పైగా బకాయిలు ఉన్నప్పటికీ, వాటిని చెల్లించకుండానే ఆందోళన చేసి మృతదేహాన్ని తీసుకెళ్లారని యాజమాన్యం వెల్లడించింది.






