మాది సెమీకండక్టర్ల ఉత్పత్తి.. మీది సూసైడ్ బాంబర్ల ఉత్పత్తి.. పాక్‍పై రెచ్చిపోయిన రాజ్‍నాథ్ సింగ్

by Prasad Jukanti |   (  Updated:2026-07-26 06:07:04  IST  )

కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా పాకిస్తాన్‌పై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. POK మినహా చర్చలుండవని స్పష్టం చేశారు.

మాది సెమీకండక్టర్ల  ఉత్పత్తి.. మీది సూసైడ్ బాంబర్ల ఉత్పత్తి.. పాక్‍పై రెచ్చిపోయిన రాజ్‍నాథ్ సింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పాకిస్తాన్‍తో చర్చలపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి మరోసారి కుండబద్దలు కొట్టారు. పీఓకేపై తప్ప మిగతా విషయాల్లో ఆ దేశంతో చర్చలు ఉండవని తేల్చేశారు. పాకిస్తాన్‌లో మిలిటరీకి, మిలిటెంట్లకు మధ్య పెద్ద తేడా లేదని, ఉగ్రవాదాన్నే అజెండాగా ఆ దేశం మార్చుకుందన్నారు. భారత్ సెమీ కండక్టర్ తయారుచేస్తుంటే, పాక్ సూసైడ్ బాంబర్లను తయారు చేస్తోందని విమర్శించారు. కార్గిల్ యుద్ధం దేశానికి కేవలం సైనిక, దౌత్యపరమైన విజయం మాత్రమే కాదని, భారత సైనికుల అకుంఠిత ధైర్యాన్ని ప్రపంచం చూసిన ఘట్టమని ఆయన పేర్కొన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులకు రక్షణ మంత్రి ఆదివారం నివాళులర్పించారు. ద్రాస్‌లోని కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.

మాది ఉపగ్రహాల రూకపల్పన.. మీది ఉగ్రవాద రూపకల్పన:

ప్రపంచానికి భారత్ సాఫ్ట్‌వేర్ ఇస్తుంటే, పాకిస్తాన్‌ బాంబ్ షెల్స్ ఇస్తోందని, నేడు భారత్ ఆవిష్కరణల వైపు అడుగులు వేస్తుంటే పాకిస్తాన్ మాత్రం చొరబాటుకు కొత్త మార్గాలను వెతుకుతోందన్నారు. భారత్ యుద్ధ నౌకలను రూపకల్పన చేస్తుంటే పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదానికి రూపకల్పన చేయడంలో నిమగ్నమైందన్నారు. భారత్ అంతరిక్ష యాత్రలకు ప్రసిద్ధి చెందితే పాకిస్తాన్ ప్రాక్సీ మిషన్లను నిర్వహిస్తోందని ఎద్దేవా చేశారు. భారత్ అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపిస్తుంటే పాకిస్తాన్ సరిహద్దు అవతలకు ఉగ్రవాదులను పంపడంలోనే నిమగ్నమైందన్నారు. భారత్ యూపీఐ ద్వారా ప్రపంచాన్ని అనుసంధానిస్తుంటే పాకిస్తాన్ మాత్రం హవాలా ద్వారా ఉగ్రవాదాన్ని అనుసంధానిస్తోందన్నారు. తన దుష్ట పన్నాగాలతో మన పురోగతిని అడ్డుకునేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని అయితే పాకిస్తాన్‍కు సరైన సమాధానం ఇవ్వడానికి మన సైన్యం పూర్తి సిద్ధంగా ఉందన్నారు.

Next Story