- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్పంచ్ భర్త పెత్తనంపై తిరుగుబాటు!
మాచారెడ్డి మండలంలోని గజ్యానాయక్‌తండాలో మహిళా సర్పంచ్‌కు బదులుగా ఆమె భర్త ఏకపక్షంగా పాలన సాగిస్తున్నారు. పంచాయతీ ఆఫీసులో ప్రత్యేక ఛాంబర్ వేసుకుని భర్త, ఇద్దరు కొడుకులు అజమాయిషీ చేయడంపై వార్డు సభ్యులు తిరుగుబాటు చేశారు.

మాచారెడ్డి మండలంలోని గజ్యానాయక్‌తండాలో మహిళా సర్పంచ్‌కు బదులుగా ఆమె భర్త ఏకపక్షంగా పాలన సాగిస్తున్నారు. పంచాయతీ ఆఫీసులో ప్రత్యేక ఛాంబర్ వేసుకుని భర్త, ఇద్దరు కొడుకులు అజమాయిషీ చేయడంపై వార్డు సభ్యులు తిరుగుబాటు చేశారు. సొంత బోరు పేరుతో ప్రచారం చేసుకుని, ఇప్పుడు పంచాయతీ నిధుల డ్రా కోసం ఎంబీ రికార్డులు రాయించడంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. చట్టం ప్రకారం సర్పంచ్ మాత్రమే పాలించాల్సి ఉన్నా అధికారులు రాజకీయ ఒత్తిళ్లతో పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. సర్పంచ్‌ల శిక్షణా తరగతుల్లో భర్తల హాజరుపై ‘సతుల స్థానంలో పతులు’ శీర్షికతో ‘దిశ’ నాడే కథనం ప్రచురించింది. ‘దిశ’ హెచ్చరించిన సర్పంచ్ భర్తపైనే నేడు వార్డు సభ్యులు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.
- దిశ, మాచారెడ్డి
దిశ, మాచారెడ్డి : మహిళల రాజకీయ సాధికారత కోసం రాజ్యాంగం గ్రామ పంచాయతీల్లో కల్పించిన రిజర్వేషన్లు అభాసుపాలవుతున్నాయి. గ్రామ పరిపాలనలో మహిళలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేలా చట్టాలు రూపొందించినా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. మహిళా సర్పంచ్ స్థానంలో వారి భర్తలే అధికారం చెలాయిస్తున్నారనే ఆరోపణలు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో నిజమయ్యాయి. గజ్యానాయక్ తండా గ్రామ సర్పంచ్ భర్త జోక్యం, పెత్తనం శృతిమించిందని ఆరోపిస్తూ వార్డు సభ్యులు ఏకమై మండల, జిల్లాస్థాయి అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
ప్రత్యేక ఛాంబర్.. పంచాయతీ నిధులపై కన్ను...
వార్డు సభ్యుల ఫిర్యాదు పత్రం ప్రకారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక ఛాంబర్‌ను ఏర్పాటు చేసుకుని సర్పంచ్‌కు బదులుగా ఆమె భర్త కూర్చొని పరిపాలన సాగిస్తున్నారు. సర్పంచ్ భర్తతోపాటు ఆమె ఇద్దరు కుమారులు కూడా అజమాయిషీ చేస్తున్నారు. గ్రామంలోని పనులు, నిర్ణయాలు, బిల్లులు, అధికారులతో సమావేశాలు అన్నీ ఆయనే చూసుకుంటున్నారు. చివరకు గ్రామ పంచాయతీ సమావేశాల్లో సైతం సర్పంచ్ భర్తే నిర్ణయాలు తీసుకుంటున్నారని సభ్యులు మండిపడ్డారు. సొంత నిధులతో తాగునీటి బోరు వేయించినట్లు పత్రికా ప్రకటన ఇచ్చి, ఇప్పుడు పంచాయతీ నిధుల నుంచి ఆ డబ్బులు తీసుకోవడానికి ఎంబీ రికార్డులు చేయిస్తున్నారని ఆరోపించారు. వార్డు సభ్యుల అభిప్రాయాలను పట్టించుకోకపోవడంతో పాలనా వ్యవహారాలు తెలియడం లేదని వాపోతున్నారు.
చట్టాలు చెప్తున్నదేంటి.. అధికారులు చేస్తున్నదేంటి?..
73వ రాజ్యాంగ సవరణ, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం-2018 ప్రకారం ఎన్నికైన సర్పంచ్ మాత్రమే పరిపాలన, సమావేశాల నిర్వహణ, నిర్ణయాలకు బాధ్యత వహించాలి. ఎన్నిక కానీ ఏ వ్యక్తీ పంచాయతీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. కానీ అధికారుల బాధ్యతారాహిత్యం వల్లే చట్టాలు పక్కదారి పడుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. అధికారిక సమాచారానికి సర్పంచ్ భర్తల ఫోన్ నంబర్లు వాడడం, అధికారులే భర్తలను ‘సర్పంచ్ సాబ్’ అని పిలవడంతోనే సతుల స్థానంలో పతుల రాజ్యం పాతుకుపోయింది. అధికార పార్టీ నాయకుల నుంచి ఇబ్బందులు వస్తాయేమోనని అధికారులు మౌనం వహిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు.
ఆనాడే వెలుగులోకి తెచ్చిన ‘దిశ’...
సర్పంచ్ ఎన్నికల అనంతరం ప్రభుత్వ శిక్షణా తరగతులకు మహిళా సర్పంచ్‌లకు బదులుగా వారి భర్తలు హాజరయ్యారని ‘సతుల స్థానంలో పతులు’ అనే శీర్షికతో ‘దిశ’ దినపత్రిక ఆదిలోనే వెలుగులోకి తెచ్చింది. నాడే శిక్షణకు హాజరైన గజ్యానాయక్‌తండా సర్పంచ్ భర్తపైనే నేడు వార్డు సభ్యులు ఫిర్యాదు చేయడం విశేషం. దిశ ప్రచురించిన కథనం రోజే అధికారులు స్పందించి ఉంటే పరిస్థితి ఇక్కడిదాకా వచ్చేది కాదని స్థానికులు భావిస్తున్నారు. ఇప్పటికైనా యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకుంటుందా? లేదా అనేది వేచి చూడాలి.






