Weekly Horoscope:మీనరాశిలోకి శని వక్ర గమనం.. ఈ వారం జాగ్రత్తగా ఉండవలసిన రాశులివే?

by Jakkula.Mamatha |

నేటి(జులై 26) నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు గ్రహాల సంచారం ఆధారంగా ద్వాదశ రాశుల వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Weekly Horoscope:మీనరాశిలోకి శని వక్ర గమనం.. ఈ వారం జాగ్రత్తగా ఉండవలసిన రాశులివే?
X

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల సంచారం రాశి చక్రములోని 12 రాశుల పై ప్రభావం చూపుతుంది. ఈ వారంలో జులై 27న శని దేవుడు మీన రాశిలో వక్రగమనం ప్రారంభించనున్నారు. దీనివల్ల ప్రతి పనిలోనూ కాస్త ఆలస్యం జరగడం వంటివి జరుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ తరుణంలో.. నేటి(జులై 26) నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు గ్రహాల సంచారం ఆధారంగా ద్వాదశ రాశుల వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి

ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. పాత బాకీలు వసూలయ్యే అవకాశాలు ఉన్నాయి. రోజువారీ పనులలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కుటుంబ సభ్యుల సలహాలు ప్రయోజనకరంగా ఉంటాయి. స్వల్ప ఆరోగ్య అసౌకర్యాలు కలిగే అవకాశం ఉంది, తగిన విశ్రాంతి అవసరం. పని చేసే విధానంలో కొన్ని అనుకూల మార్పులు చేసుకోవడం వల్ల వృత్తి ఉద్యోగాల్లో పురోగతి లభిస్తుంది. ఉద్యోగులకు పని భారం పెరిగినప్పటికీ అధికారుల ఆమోదం లభిస్తుంది. వ్యాపారవేత్తలకు నూతన ఒప్పందాలు కలిసివస్తాయి. కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలు ఫలించి, ఆనందకర వాతావరణం నెలకొంటుంది. రోజువారీ పూజలో శివారాధన చేయడం లేదా రుద్రాష్టకం పఠించడం మేలు చేస్తుంది.

వృషభ రాశి

ఈ వారం వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. బాకీ ఉన్న డబ్బు చేతికందుతుంది. ఉద్యోగంలో అనుకూల మార్పులు ఉంటాయి. మీ ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. గతంలో నిలిచిపోయిన పనులు మళ్లీ వేగం పుంజుకుంటాయి. ఉద్యోగులకు అధికారుల ప్రోత్సాహం అందుతుంది. భూ లేదా ఆస్తి వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అప్రమత్తంగా ఉండాలి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. రోజూ హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది.

మిథున రాశి

గ్రహాల సంచారం అనుకూలంగా ఉండటంతో మానసిక ఉత్సాహం పెరుగుతుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ యోగం ఉంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. పనులను వాయిదా వేయకుండా సమయానికి పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఆరోగ్యం బాగుంటుంది. ఈ వారం ఈ రాశి వారు రామ ఆలయాన్ని సందర్శించడం లేదా శ్రీరామ నామ స్మరణ చేయడం మంచిది.

కర్కాటక రాశి

ఈ రాశి వారికి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ, అనుకోని ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావచ్చు, ఓర్పు వహించడం మంచిది. ఆత్మీయులు, బంధువుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ అవసరం. కాలభైరవాష్టకం లేదా ఈశ్వరారాధన చేయడం వల్ల చికాకులు తొలగిపోతాయి.

సింహ రాశి

గ్రహబలం అనుకూలంగా ఉండటం వల్ల ఆశించిన సమాచారం అందుతుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వృత్తి జీవితంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో వ్యూహాత్మక ఆలోచనలు మంచి ఫలితాలను ఇస్తాయి. కొత్త ఉద్యోగాల్లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార భాగస్వాములతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. మిత్రులతో, కుటుంబంతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ప్రతిరోజూ ఉదయాన్నే సూర్య నమస్కారాలు లేదా ఆదిత్య హృదయ స్తోత్రం పఠించడం శ్రేయస్కరం.

కన్య రాశి

ఈ వారం ఈ రాశి వారికి అన్ని విధాలా అనుకూలమైన సమయం. విద్యార్థులు పోటీ పరీక్షల్లో శుభ ఫలితాలు సాధిస్తారు. వృత్తి వ్యాపారాల్లో శ్రమకు తగిన లాభాలు పొందుతారు. ఇల్లు లేదా వాహన మరమ్మతుల వల్ల అనుకోని ఖర్చులు రావచ్చు. ఆహార నియమాలు పాటించడం మంచిది. బంధువుల నుంచి మద్దతు లభిస్తుంది. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించడం శుభప్రదం.

తుల రాశి

ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, తీర్థయాత్రలపై ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారంలో అదృష్టం కలసివస్తుంది. ఖర్చులను నియంత్రించుకోవడం ద్వారా ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. లక్ష్మీదేవి పూజ లేదా కనకధారా స్తోత్రం పఠనం అనుకూలిస్తుంది.

వృశ్చిక రాశి

ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉండబోతుంది. దీర్ఘకాలిక సమస్యలు, న్యాయ వ్యవహారాలు సర్దుమణుగుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల సత్ఫలితాలు దక్కుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. తోటివారితో లేదా సహోద్యోగులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి. ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది. ఒత్తిడికి గురికాకుండా యోగా లేదా ధ్యానం చేయడం మేలు. వినాయకుడిని సందర్శించి, సంకటనాశన గణేశ స్తోత్రం పఠించడం మేలు చేస్తుంది.

ధనుస్సు రాశి

ఈ రాశి వారికి ఈ వారం అదృష్టం తోడవుతుంది. పెండింగ్‌లో ఉన్న పనులు వేగంగా పూర్తవుతాయి. ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి అనుకూలంగా ఉంది. పనుల్లో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశాలు ఉన్నాయి. భూ లావాదేవీలు లాభదాయకంగా సాగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతమవుతాయి. సుదూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబంలో సంతోషం నిండుతుంది. దత్తాత్రేయ స్తోత్రం లేదా గురుచరిత్ర పఠనం మంచి ఫలితాలనిస్తుంది.

మకర రాశి

ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగుల మద్దతు అందుతుంది. కుటుంబంలో శుభకార్య వాతావరణం ఉంటుంది. వ్యాపారాల్లో ఒత్తిడి పెరగకుండా ప్రణాళికబద్ధంగా ముందుకు సాగడం మంచిది. పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవడం మంచిది. దుర్గాదేవి ఆరాధన లేదా లలితా సహస్రనామం పఠించడం శుభప్రదం.

కుంభ రాశి

ఈ రాశి వారికి ఈ వారం బాగుంటుంది. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు సాధించే అవకాశాలు ఉంటాయి. జీవిత భాగస్వామి మద్దతుతో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార లాభాలు సంతృప్తికరంగా ఉంటాయి. ధన లావాదేవీల విషయంలో, మిత్రుల వద్ద అప్రమత్తంగా ఉండాలి. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు లేదా విష్ణు సహస్రనామం పఠించడం మేలు చేస్తుంది.

మీన రాశి

మీన రాశి వారికి శ్రమకు తగిన ఫలితాలు అందుతాయి. ఉద్యోగంలో మీ ప్రాధాన్యం పెరుగుతుంది. పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా సహనంతో అధిగమిస్తారు. ఆర్థికంగా అనుకూలంగా ఉన్నప్పటికీ, సమయానికి తగిన నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యం. నిలిచిపోయిన ధనం చేతికి అందుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా స్థానచలనం సంభవించవచ్చు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. శివాభిషేకం లేదా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం శుభఫలితాలనిస్తుంది.

Next Story