వరి నాట్లకు కొంగల ఎఫెక్ట్! నాట్లను దెబ్బతీస్తున్న కొంగల గుంపులు

by Ajay Maddhiboyina |   (  Updated:2026-07-26 01:59:33  IST  )

వర్షాలు లేక మొన్నటి వరకు ఆందోళన చెందిన రైతులకు, గత వారం పది రోజులుగా కురుస్తున్న తేలికపాటి వర్షాలు ఊరటనిచ్చాయి. వర్షాలు లేక నాట్లు ఆలస్యమై నారు మళ్లు (తుకం) ముదిరిపోతుందన్న భయంతో ఉన్న రైతులు హుషారుగా నాట్లు వేస్తున్నారు.

వరి నాట్లకు కొంగల ఎఫెక్ట్! నాట్లను దెబ్బతీస్తున్న కొంగల గుంపులు
X

దిశ, భిక్కనూరు : వర్షాలు లేక మొన్నటి వరకు ఆందోళన చెందిన రైతులకు, గత వారం పది రోజులుగా కురుస్తున్న తేలికపాటి వర్షాలు ఊరటనిచ్చాయి. వర్షాలు లేక నాట్లు ఆలస్యమై నారు మళ్లు (తుకం) ముదిరిపోతుందన్న భయంతో ఉన్న రైతులు హుషారుగా నాట్లు వేస్తున్నారు. ఆరుతడి పంటలు వేయాలని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, రైతులు మాత్రం తమ వద్ద ఉన్న నీటి లభ్యత ఆధారంగా వరి పంట వైపే మొగ్గుచూపుతున్నారు.

ఎకరాకు రూ.6వేల వరకు గుత్తా..

ప్రస్తుతం నాట్లు వేయడానికి కూలీల కొరత ఉండడంతో ఎకరాకు గుండుగుత్తగా మాట్లాడుకుంటున్నారు. స్థానిక కూలీలు ఎకరాకు రూ.5,500 నుంచి రూ.6వేల వరకు డిమాండ్ చేస్తుండడంతోపాటు పెట్టే కల్లు, పైసలు తీసుకుని నాట్లు వేస్తున్నారు. అదే సమయంలో బీహార్‌ నుంచి వచ్చిన వలస కూలీలు ఎకరాకు రూ.5వేల నుంచి రూ.5,500లకే నాట్లు వేస్తుండడంతో వారికి కూడా డిమాండ్ పెరిగింది. అయితే, ఇతర రాష్ట్రాల కూలీలతో వేయిస్తే నాట్ల మధ్య గ్యాప్ ఎక్కువ వస్తుందన్న ఉద్దేశంతో స్థానిక కూలీల వైపే మెజార్టీ రైతులు మొగ్గు చూపుతున్నారు.

వరికి కొంగల ముప్పు...

ఒకపక్క నాట్లు ఆలస్యమవుతున్నాయని టెన్షన్ పడుతుంటే.. మరోపక్క వేసిన నాట్లను కొంగల గుంపులు తొక్కుతుండడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఒకేసారి 20 నుంచి 30 వరకు కొంగలు నాట్లు వేసిన పొలాల్లో దిగుతుండడంతో వాటి పాదాల కింద పడి వేసిన నాట్లు నలిగిపోయి దెబ్బతింటున్నాయి. దీంతో రైతులు వాటిని వెళ్లగొడుతూ దెబ్బతిన్న చోట మళ్లీ కొత్త నాట్లు వేసుకోవాల్సి వస్తోంది. వర్షాలు సరిగ్గా లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో వేసిన నాట్లను కొంగల నుంచి కాపాడుకోవడానికి పొలాల వద్ద కాపలా కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు.

Next Story