- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ముందు రాజీనామా.. ఆ తర్వాతే చేరిక’: మల్లారెడ్డికి బీజేపీ అగ్రనేతల చెక్!
మేడ్చల్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి బీజేపీలో చేరికపై సస్పెన్స్ కొనసాగుతోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీలో చేరే ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాల్సిందేనని ఆ పార్టీ అగ్రనేతలు స్పష్టం చేస్తున్నారు. ఇటీవలే పార్టీలో చేరడానికి ముందుకొచ్చిన మేడ్చల్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డిలకు కూడా ఇదే నిబంధనను వారి ముందు ఉంచినట్లుగా తెలిసింది. గతంలోనూ ఇదే నిబంధనను అమలు చేశామని, ఇప్పుడు కూడా అదేవిధంగా ఉంటుందని తెలిపినట్లుగా సమాచారం. రాజీనామా తరువాత జరిగే ఉప ఎన్నికల్లో గెలవడానికి పార్టీ, పార్టీ కేడర్ అన్ని విధాలుగా సహకరిస్తుందని వారు భరోసా ఇచ్చినట్లుగా తెలిసింది. అయితే మామాఅల్లుళ్లు మాత్రం రాజీనామా చేసి పార్టీలో చేరాలనే విషయమై సందిగ్ధంలో ఉన్నట్లుగా తెలిసింది. ఐదు లక్షలకు పైగా ఉన్న ఓటర్ల నియోజకవర్గాలు కావడంతో ఉప ఎన్నికల్లో ఖర్చు, గెలుపు, ఓటములపై వారు తర్జనభర్జన పడుతున్నారని చర్చ నడుస్తున్నది. దీనిపై సమాలోచనలు జరుపుతున్నారని సమాచారం. పార్టీలో చేరితే తమకు తమ సిట్టింగ్ సీట్లతో పాటుగా కొడుకు, కోడలుకు కనీసం మరో రెండు సీట్లు కావాలని వారు అడిగినట్లుగా తెలిసింది.
ముందే హామీ ఇవ్వడం కుదరదు..
మల్లారెడ్డి కోడలు గత అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచే ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా తిరుగుతున్నారు. మామ మల్లారెడ్డి గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉత్సాహాన్ని ఆమె వ్యక్తం చేస్తున్నారు. అయితే మల్లారెడ్డి డిమాండ్లపై కమలనాథుల నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాలేదని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. మొదట పార్టీలో చేరండి.. ఎన్నికల సమయంలో టిక్కెట్ల గురించి ఆలోచిద్దామని వారు చెప్పినట్లుగా సమాచారం. బీజేపీలో ముందే హామీలు ఇచ్చే సంస్కృతి ఉండదని, ఒకరికి హామీ ఇస్తే పార్టీలో చేరే ఇతర నాయకులకు కూడా హామీలు ఇవ్వాల్సి వస్తుందని వారు అన్నట్లుగా సమాచారం. నియోజకవర్గాల పునర్విభజన, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ సీట్లు, మహిళా రిజర్వేషన్లు.. ఇలా వీటన్నింటితోపాటుగా సర్వేలు, సామాజిక వర్గాలను చూసుకుని టిక్కెట్లు ఇస్తారని, ఇదంతా పార్టీకి చెందిన ఢిల్లీ పెద్దల కనుసన్నల్లో జరుగుతుందని వారు విడమర్చి చెప్పినట్లుగా తెలిసింది.
ఉప ఎన్నికలు వస్తే..
ఒక కుటుంబానికి నాలుగైదు సీట్లు ఇచ్చే పరిస్థితి బీజేపీలో కష్టమనే వాదనను వారు వినిపించినట్లుగా సమాచారం. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు అడుగులు వేస్తున్నారని కమలనాథులు చెబుతున్నారు. ఆయన రాక ఆలస్యం కావచ్చు కానీ పార్టీలోకి రావడం పక్కా అంటూ బీజేపీకి చెందిన ఒక ముఖ్య నేత తన కీలక అనుచరులతో అన్నట్లుగా తెలిసింది. మల్లారెడ్డి వ్యాపారాలు, విద్యాసామ్రాజ్యం, కుటుంబంలో రాజకీయ అవకాశాలు, భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ఆయన బీజేపీలోకి వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. మల్లారెడ్డి, ఆయన అల్లుడిని రాజీనామా చేయించి ఉప ఎన్నికలు తీసుకురావడం ద్వారా బీజేపీకి ప్రజల్లో ఆదరణ ఏ విధంగా ఉంది, గతంలో కంటే ఓట్లు ఎంతవరకు పెరిగాయా?, అభ్యర్థుల ద్వారా పెరిగాయా, పార్టీ ద్వారా పెరిగాయా? తదితర అంశాలను అంచనా వేయవచ్చని చెబుతున్నారు.
ఆచితూచి అడుగు వేసే చాన్స్..
గతంలో మునుగోడు ఉప ఎన్నిక సమయంలో అధికార పార్టీగా ఉన్న బీఆర్‌ఎస్ అక్కడ గెలవడానికి తీవ్ర ప్రయత్నాలు చేసింది. దాదాపుగా ఎమ్మెల్యేలు, మంత్రులందరిని అక్కడే మోహరించింది. దీంతో బీజేపీ రెండో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. ఆ తరువాత జరిగిన అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో అక్కడ బీజేపీ మూడో స్థానానికి వెళ్లింది. దీంతో తమకు పార్టీ పరిస్థితి వాస్తవిక అంచనాలు తెలుస్తాయని కూడా అనుకుంటున్నారు. ఓడిపోతే ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది. గతంలో మునుగోడు గ్రామీణ ప్రాంతం అయినందున ఓడిపోయామని, ఇప్పుడు హైదరాబాద్నగరంలో కూడా అదేవిధంగా పరిస్థితి ఉందా? అనే కోణంలో విశ్లేషించుకుంటామంటున్నారు. అయితే మల్లారెడ్డి ఖర్చు, గెలుపు విజయావకాశాలపై ఆచితూచి అంచనాలు వేసుకుంటున్నారని, కొంత ఆలస్యం అయితే ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఉప ఎన్నిక రాదనే కోణంలోనూ ఆయన అంచనాలు వేసుకుంటున్నారని సమాచారం.






