హైదరాబాద్‌లో అతిపెద్ద క్రాకర్స్ షో : ట్యాంక్ బండ్ పరిసరాల్లో రికార్డు స్థాయి ట్రాఫిక్ జామ్!

by Muthe.Rajitha |   (  Updated:2026-07-26 01:10:27  IST  )

హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ వేదికగా నిర్వహించిన దేశంలోనే అతిపెద్ద క్రాకర్స్ షో అత్యంత విజయవంతంగా పూర్తయింది.

హైదరాబాద్‌లో అతిపెద్ద క్రాకర్స్ షో : ట్యాంక్ బండ్ పరిసరాల్లో రికార్డు స్థాయి ట్రాఫిక్ జామ్!
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ వేదికగా నిర్వహించిన దేశంలోనే అతిపెద్ద క్రాకర్స్ షో అత్యంత విజయవంతంగా పూర్తయింది. క్రాకర్స్ డీలర్స్ అసోసియేషన్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని అసోసియేషన్ శతాబ్ది ఉత్సవాల పేరిట ఈ భారీ బాణాసంచా ప్రదర్శనను ఏర్పాటు చేసింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా ఈ ఈవెంట్‌పై విస్తృత ప్రచారం జరగడంతో నగరవాసులు క్రాకర్స్ షోను తిలకించేందుకు ఆసక్తిగా తరలి వచ్చారు. శనివారం సాయంత్రం జరిగిన ఈ ప్రతిష్ఠాత్మక షోకు ఊహించని విధంగా దాదాపు 2 లక్షల మందికి పైగా ప్రజలు హాజరయ్యారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. దీంతో నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయాయి. అనివార్య కారణాల వల్ల ప్రదర్శన ప్రారంభం కావడం కాస్త ఆలస్యమైనప్పటికీ, ఆ తర్వాత నింగిలో విరబూసిన రంగురంగుల బాణాసంచా కాంతులు వీక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.

అయితే, ఒకవైపు అపూర్వ జనసందోహంతో క్రాకర్స్ షో కొనసాగుతుండగానే, మరొకవైపు ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన దాడిని ఖండిస్తూ తెలంగాణ ప్రభుత్వం సెక్రటేరియట్ రోడ్డులో భారీ క్యాండిల్ ర్యాలీ చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు, వందలాది మంది కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొనడంతో ఆ ప్రాంతమంతా రద్దీగా మారింది. ఒకే సమయంలో వేలాది వాహనాలు, లక్షల మంది జనం రోడ్లపైకి రావడం, రాకపోకలపై ఎలాంటి ముందస్తు నియంత్రణ లేకపోవడంతో ఖైరతాబాద్, లోయర్ ట్యాంక్ బండ్, లక్డీకాపూల్, హిమాయత్ నగర్, సికింద్రాబాద్ మార్గాల్లో దాదాపు 4 గంటల పాటు భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. గంటల తరబడి వాహనాల్లో నిలిచిపోయిన ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Next Story