ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్.. అనహత్ సింగ్

by Muthe.Rajitha |

కెనడాలోని అంటారియో వేదికగా జరిగిన 'వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్' ఫైనల్లో ఢిల్లీకి చెందిన 19 ఏళ్ల అనాహత్ సింగ్ సంచలన విజయంతో చరిత్ర సృష్టించారు.

ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్.. అనహత్ సింగ్
X

దిశ, వెబ్ డెస్క్ : కెనడాలోని అంటారియో వేదికగా జరిగిన 'వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్' ఫైనల్లో ఢిల్లీకి చెందిన 19 ఏళ్ల అనాహత్ సింగ్ సంచలన విజయంతో చరిత్ర సృష్టించారు. ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్‌లో పసిడి పతకం సాధించి, స్క్వాష్ ప్రపంచ టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయ క్రీడాకారిణిగా ఆమె రికార్డు పుటలకెక్కారు.

ఈ టోర్నీ ఫైనల్‌పోరులో అనాహత్ సింగ్ ఈజిప్ట్‌కు చెందిన రెండో సీడ్ క్రీడాకారిణి రుకయ్యా సలేమ్‌ను 11-3, 11-7, 11-9 అనే తేడాతో వరుస గేమ్‌లలో చిత్తు చేసి స్వర్ణాన్ని ముద్దాడారు. గతంలో జూనియర్ విభాగంలో ఈజిప్ట్ క్రీడాకారుల ఆధిపత్యానికి తెరదించుతూ, 2010 తర్వాత ఈ టైటిల్ గెలుచుకున్న తొలి నాన్-ఈజిప్షియన్ ప్లేయర్‌గా కూడా ఆమె నిలిచారు. గత ఐదు ప్రయత్నాలలో క్వార్టర్స్, సెమీస్‌లకే పరిమితమైన అనాహత్, తన ఐదో ప్రయత్నంలో ఆ నిరీక్షణకు తెరదించి విజేతగా నిలిచారు.

కలా.. నిజమా అనిపిస్తోంది : అనాహత్

ఈ అపూర్వ విజయంపై అనాహత్ స్పందిస్తూ.. "నేను ఇంకా కలలోనే ఉన్నట్లు అనిపిస్తోంది. గత కొన్ని ఎడిషన్లుగా సెమీఫైనల్స్, క్వార్టర్స్‌లోనే నిష్క్రమించడంతో ఈ టోర్నీ నాకు ఒక శాపంలా అనిపించేది. కానీ జూనియర్ సర్క్యూట్‌లో నా చివరి అవకాశమైన ఈ టోర్నీలో గెలవడం చాలా ఆనందంగా ఉందో" అని ఉద్వేగానికి లోనయ్యారు. భారత స్క్వాష్ దిగ్గజం సౌరవ్ ఘోషల్, మాజీ ప్రపంచ ఛాంపియన్ గ్రెగొరీ గౌల్టియర్ మార్గదర్శకత్వంలో శిక్షణ పొందుతున్న అనాహత్ సింగ్, 2028 లాస్ ఏంజెల్స్ (LA) ఒలింపిక్స్‌లో భారతదేశానికి ప్రధాన పతక ఆశాకిరణంగా నిలవనున్నారు.

Next Story