180కిమీలు భర్తను వీపుపై మోసిన భార్య

by Muthe.Rajitha |

భార్యాభర్తల బంధానికి, త్యాగానికి సరికొత్త అర్థం చెబుతూ ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒక అద్భుతమైన, కంటినీరు పెట్టించే సంఘటన వెలుగులోకి వచ్చింది.

180కిమీలు భర్తను వీపుపై మోసిన భార్య
X

దిశ, వెబ్ డెస్క్ : భార్యాభర్తల బంధానికి, త్యాగానికి సరికొత్త అర్థం చెబుతూ ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒక అద్భుతమైన, కంటినీరు పెట్టించే సంఘటన వెలుగులోకి వచ్చింది. భర్త ఆశయాన్ని తన బాధ్యతగా స్వీకరించిన ఒక సామాన్య మహిళ, దివ్యాంగుడైన తన భర్తను భుజాలపై మోస్తూ ఏకంగా 180 కిలోమీటర్ల సుదీర్ఘ దూరం కాలినడకన ప్రయాణించి తన నిస్వార్థమైన ప్రేమను చాటుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మోదీనగర్‌కు చెందిన ఆశా, సచిన్ దంపతులు ఎంతో సంతోషంగా జీవిస్తున్న సమయంలో, సుమారు 12 ఏళ్ల క్రితం జరిగిన ఒక ఘోర ప్రమాదం వారి జీవితాలను తలకిందులు చేసింది. ఆ ప్రమాదంలో సచిన్ వెన్నెముకకు తీవ్ర గాయమైంది. ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోవడంతో ఆయన శాశ్వతంగా నడవలేని స్థితికి చేరుకుని మంచానికే పరిమితమయ్యారు.

అయినప్పటికీ ఆశా ఏమాత్రం అధైర్యపడలేదు. ఇద్దరు పిల్లల పోషణతో పాటు భర్త సంరక్షణ భారాన్ని తన భుజస్కంధాలపై వేసుకుని కుటుంబాన్ని నిలబెట్టింది. కాగా, పరమశివుని భక్తుడైన సచిన్‌కు హరిద్వార్‌లోని పవిత్ర శివాలయాన్ని దర్శించుకోవాలని కోరికగా ఉండేది. భర్త ఆశను, మనసులోని మాటను గ్రహించిన ఆశా.. ఆయనను ఎలాగైనా హరిద్వార్ చేరుస్తానని మాట ఇచ్చింది. అన్నట్లుగానే భర్తను తన వెనుక మోస్తూ, సుదీర్ఘమైన కఠిన దారిలో 180 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి హరిద్వార్ చేరుకుంది. ఈ దంపతుల అచంచలమైన విశ్వాసం, భార్య త్యాగాన్ని చూసి మార్గమధ్యంలో ప్రజలు, భక్తులు నీరాజనాలు పలికారు. నిజమైన ప్రేమకు, పట్టుదలకు ఈ సంఘటన ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.

Next Story