ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన మంత్రి ఉత్తమ్

by Taduka Kalyani |

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పాత వెల్లటూరు గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న మహాత్మా గాంధీ ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులను రాష్ట్ర నీటిపారుదల, ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం పరిశీలించారు.

ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన మంత్రి ఉత్తమ్
X

దిశ, చింతలపాలెం:- సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పాత వెల్లటూరు గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న మహాత్మా గాంధీ ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులను రాష్ట్ర నీటిపారుదల, ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని అధికారులు, గుత్తేదారులతో కలిసి సమీక్షించారు. ముందుగా ప్రాజెక్టులో కీలకమైన అండర్‌గ్రౌండ్ పంప్ హౌస్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి, అనంతరం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. కృష్ణా నదిపై నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం మండలాల పరిధిలోని రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు.మొత్తం రూ.1,648 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా 16 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు భారీ మోటార్ల సహాయంతో నీటిని ఎత్తిపోసి 53 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. మఠంపల్లి మండలంలోని 9 గ్రామాల్లో 20,466 ఎకరాలకు, మేళ్లచెరువు మండలంలోని 5 గ్రామాల్లో 15,829 ఎకరాలకు, చింతలపాలెం మండలంలోని 9 గ్రామాల్లో 16,705 ఎకరాలకు నీరందించనున్నట్లు వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 5,080 ఎస్టీ, 3,540 ఎస్సీ, 8,470 బీసీ, 2,205 ఓసీ కుటుంబాలు కలిపి మొత్తం 19,295 కుటుంబాలు ప్రత్యక్షంగా లబ్ధి పొందనున్నాయని పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం 191 ఎకరాల రైతుల భూములను సేకరించి వారికి నష్టపరిహారంగా రూ.56 కోట్లు చెల్లించినట్లు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల పూర్తి విషయంలో ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్న మంత్రి, మహాత్మా గాంధీ ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఈ ఏడాది నవంబర్ నాటికి పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని గుత్తేదారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యతతో పాటు వేగం కూడా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, డీసీసీ జిల్లా అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య, నందిరెడ్డి ఇంద్రారెడ్డి, చిలకల శ్రీనివాసరెడ్డి, మోర్తల సీతారెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Next Story