రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం : పోలీస్​ కమిషనర్​ బి.సుమతి

by Batti.Sumithra |

రోడ్డు భద్రత పై ప్రజల్లో అవగాహన పెంపొందించి, రోడ్డు ప్రమాదాలను నియంత్రించడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని మల్కాజ్​గిరి సీపీ బి. సుమతి అన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం : పోలీస్​ కమిషనర్​ బి.సుమతి
X

దిశ, వనస్థలిపురం : రోడ్డు భద్రత పై ప్రజల్లో అవగాహన పెంపొందించి, రోడ్డు ప్రమాదాలను నియంత్రించడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని మల్కాజ్​గిరి సీపీ బి. సుమతి అన్నారు. బుధవారం మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ ఆధ్వర్యంలో ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ 4వ విడతలో భాగంగా మహనీయుల విగ్రహాల సమీపంలో పోలీసులు ‘అరైవ్ అలైవ్’ రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీ బి.సుమతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను తగ్గించి భద్రమైన ప్రయాణ వాతావరణం కల్పించడం కోసం కృషి చేస్తున్నామన్నారు.

పోలీస్​ స్టేషన్​ పరిధిలోని కుంట్లూరు చౌరస్తా టీ జంక్షన్​ను బ్లాక్​ స్పాట్​గా గుర్తించామని, తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో నివారణ చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో ముఖ్యంగా యువత ప్రాణాలు కోల్పోతుండడం ఆందోళనకరమని సీపీ పేర్కొన్నారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం వంటి జాగ్రత్తలతో ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చన్నారు. ‘మన ప్రాణం మన చేతుల్లోనే ఉంది’ అని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హయత్​నగర్​, మన్సూరాబాద్​ డివిజన్ల మాజీ కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు కళ్లెం నవజీవన్​రెడ్డి, కొప్పుల నర్సింహ్మారెడ్డి, ఎల్బీనగర్ జోన్​​ డీసీపీ బి. అనురాధ, వనస్థలిపురం డివిజన్​ ఏసీపీ కాశిరెడ్డి, హయత్​నగర్ సర్కిల్​​ ఇన్​స్పెక్టర్​ నాగరాజ్​గౌడ్, డీఐ సంతోష్​కుమార్​,​ ఆర్టీవో, టీజీఎస్‌ఆర్టీసీ హయత్​నగర్​ డీఎంలు విజయ్​, శ్రీనివాస్​, ఆర్​అండ్​బీ, హెల్త్​ పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story