ఘనాలో ఫార్మా హబ్‌కు తెలంగాణ అండ.. మంత్రి శ్రీధర్‌బాబు కీలక ప్రకటన

by Ramesh Naini |

రిపబ్లిక్ ఆఫ్ ఘనా పారిశ్రామికాభివృద్ధికి మార్గనిర్దేశం చేసేందుకు తెలంగాణ సిద్ధంగా ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు.

ఘనాలో ఫార్మా హబ్‌కు తెలంగాణ అండ.. మంత్రి శ్రీధర్‌బాబు కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: రిపబ్లిక్ ఆఫ్ ఘనా పారిశ్రామికాభివృద్ధికి మార్గనిర్దేశం చేసేందుకు తెలంగాణ సిద్ధంగా ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. అక్కడ ఏర్పాటు చేయనున్న ఫార్మా హబ్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆ దేశ ప్రెసిడెన్షియల్ అడ్వైజర్ ఆగస్టస్ ఒబువాడుం టానో నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందం సెక్రెటేరియట్‌లో బుధవారం మంత్రి శ్రీధర్‌బాబును మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా తెలంగాణ-ఘనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. ఘనా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 24 అవర్ ఎకానమీ అండ్ యాక్సలరేటెడ్ ఎక్స్ పోర్ట్ డెవలెప్‌మెంట్ ప్రోగ్రామని.. ఫార్మా హబ్ ఏర్పాటు తదితర అంశాలను ఆగస్టస్ ఒబువాడుం టానో వివరించారు.

ఘనా పారిశ్రామిక, ఆర్థిక పరివర్తనకు సహకరించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. అనతికాలంలోనే పారిశ్రామిక రంగంలో తెలంగాణ అద్భుతమైన వృద్ధిని నమోదు చేసిందన్నారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్, డిఫెన్స్, అడ్వాన్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ తదితర రంగాల్లో అంతర్జాతీయ కేంద్రంగా ఎదిగిందన్నారు. ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్, రీసెర్చ్, వ్యాక్సిన్ తయారీ, గ్లోబల్ సప్లై చైన్ నిర్వహణ, లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణకున్న అంతర్జాతీయ నైపుణ్యాన్ని పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఘనా ప్రతినిధులకు చెప్పారు.

Next Story