తొలి వర్షానికే చేతులెత్తేసిన సర్కార్: మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్

by Kema Shiva Kumar |

హైదరాబాద్‌లో తొలి వర్షానికే భారీగా ట్రాఫిక్ జామ్, ముందస్తు చర్యల వైఫల్యంపై సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 'X' వేదికగా చేసిన సంచలన వ్యాఖ్యలు చేశారు.

తొలి వర్షానికే చేతులెత్తేసిన సర్కార్: మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తొలి వర్షానికే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం అతలాకుతలమైందని.. ఇంత నిర్లజ్జగా అంగీకరించడానికి సీఎం రేవంత్‌రెడ్డికి సిగ్గనిపించడం లేదా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ రాష్ట్రానికి దురదృష్టవశాత్తు ఆయనే ముఖ్యమంత్రి అని, మున్సిపల్ శాఖ మంత్రి అనే విషయం సైతం రేవంత్‌రెడ్డి మరిచిపోయారా అని ‘ఎక్స్’లో ప్రశ్నించారు. రోజంతా కష్టం చేసి ఇళ్లకు తిరిగి వెళ్లే సమయంలో వాహనదారులు, మరీ ముఖ్యంగా ఆడబిడ్డలు పడే అవస్థలపై ప్రభుత్వం ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం దుర్మార్గమని పేర్కొన్నారు. అధికార యంత్రాంగాన్ని, మొత్తం వ్యవస్థనంతా గుప్పిట్లో పెట్టుకుని, వర్షం రాగానే మొత్తంగా చేతులెత్తేయడం సీఎం అసమర్థత కాకపోతే మరేంటని నిలదీశారు. హైదరాబాద్ ప్రజలు రోడ్లపై ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి దాదాపు నాలుగు గంటలపాటు నరకయాతనకు గురవుతుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా స్పందించిన పాపాన పోలేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో ఏటా వర్షాకాలం రాకముందే మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ముందస్తు చర్యలు తీసుకునే సంప్రదాయాన్ని ఈ సీఎం రాగానే తుంగలో తొక్కారని కేటీఆర్ విమర్శించారు. నగర పరిస్థితిపై కనీసం ఒక్క సమీక్ష కూడా లేదని.. చెత్తతో కూరుకుపోయిన డ్రైనేజీలను, పేరుకుపోయిన మురికి కాలువలను క్లీన్ చేసిన దాఖలాలే లేవని ధ్వజమెత్తారు. వర్షాకాల ప్రణాళిక సన్నద్ధత ఏమాత్రం చేయకపోవడం వల్లనే నగరంలో చిన్న వర్షానికే ఇంత దారుణమైన పరిస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు. ఓవైపు కరెంట్ కోతలు, మరోవైపు విద్యుదాఘాతాలతో మరణాలు సంభవించినా ఈ సర్కారుకు చీమకుట్టినట్టు లేదని మండిపడ్డారు. కేవలం రాజధానిలో విలువైన భూములను కబళించడమే ఏకైక పనిగా పెట్టుకున్న రేవంత్ పాలనకు బుద్ధి చెప్పేందుకు హైదరాబాద్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. రాష్ట్రానికే ఎకనామిక్ ఇంజన్ అయిన హైదరాబాద్‌ను గాలికొదిలేసిన సీఎంకు, కాంగ్రెస్ పార్టీకి వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల చేతిలో శిక్ష తప్పదని కేటీఆర్ హెచ్చరించారు.

Next Story