ఒంటరి ప్రయాణికులే టార్గెట్.. మూడు కేసులు ఛేదించిన మద్నూర్ పోలీసులు

by Batti.Sumithra |

హైవేలపై ఒంటరిగా ప్రయాణించే వారిని లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్న అంతర్‌రాష్ట్ర ముఠాను మద్నూర్ పోలీసులు అరెస్ట్ చేసి మూడు కేసులను ఛేదించారు.

ఒంటరి ప్రయాణికులే టార్గెట్.. మూడు కేసులు ఛేదించిన మద్నూర్ పోలీసులు
X

దిశ, మద్నూర్ : హైవేలపై ఒంటరిగా ప్రయాణించే వారిని లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్న అంతర్‌రాష్ట్ర ముఠాను మద్నూర్ పోలీసులు అరెస్ట్ చేసి మూడు కేసులను ఛేదించారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశాల మేరకు, బాన్సువాడ డీఎస్పీ బి. విఠల్ రెడ్డి పర్యవేక్షణలో బిచ్కుంద సీఐ రవికుమార్, మద్నూర్ ఎస్ఐ మోహన్ రెడ్డి, సీసీఎస్ ఎస్ఐ ఉస్మాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్ సాయంతో నిందితులను గుర్తించారు. నిందితులు మహారాష్ట్ర నాందేడ్ జిల్లాకు చెందిన షేక్ ఇలియాస్, మహమ్మద్ ఇస్మాయిల్ @ జునైద్, సమీర్ షాగా పోలీసులు గుర్తించారు.

వీరు జూన్ 1 రాత్రి నాందేడ్ నుంచి స్ప్లెండర్ బైక్‌ పై బయలుదేరి, మద్నూర్ వద్ద షేక్ గౌస్ వద్ద నుంచి మొబైల్, రూ.1000, జుక్కల్ చౌరస్తా వద్ద వి. శ్రీనివాస్ వద్ద నుంచి మొబైల్, రూ.300, నిజాంసాగర్ వద్ద చాకలి రాజు వద్ద నుంచి పల్సర్ బైక్ దోచుకున్నారు. సలబత్‌పూర్ సమీపంలో మరో దోపిడీకి వెళ్తుండగా చెక్‌పోస్ట్ వద్ద వాహన తనిఖీ చేస్తున్న పోలీసులు ముగ్గురిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 3 కత్తులు, 4 మొబైల్ ఫోన్లు, 2 బైకులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించామని డీఎస్పీ విఠల్ రెడ్డి తెలిపారు. హైవేల పై అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలు గమనిస్తే వెంటనే డయల్-100కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. కేసు ఛేదించిన పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించారు.

Next Story