బాబోయ్.. ఇంటర్నెట్ అస్సలే వద్దు.. 47% యువతలో అదే ఆలోచన!

by Javid Pasha |

ఒక సర్వే ప్రకారం.. యువత ఇంటర్నెట్ వాడకంతో విసిగిపోతోంది. 47% మంది ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని ఇష్టపడతున్నారు.

బాబోయ్.. ఇంటర్నెట్ అస్సలే వద్దు.. 47% యువతలో అదే ఆలోచన!
X

దిశ, ఫీచర్స్ : ఈరోజుల్లో ప్రపంచమంతా ఇంటర్నెట్‌పై ఆధారపడుతోంది. ఇదొక సమాచార సర్వస్వంగా, నాలెడ్జ్ హబ్‌గా వెలుగొందుతోంది. అయితే ఇటీవలి ఒక సర్వే మాత్రం ఇందుకు భిన్నంగా ఆశ్చర్యకరమైన ఫలితాలను వెల్లడించింది. 16 నుంచి 21 ఏడ్ల మధ్య వయసుగల యువతలో సగం మంది ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని కోరుకుంటున్నారని తెలిపింది? ఎందుకలా? ఈ మార్పునకు కారణాలేమిటి?

47% మందిలో అదే కోరిక..

వినడానికి వింతగా అనిపించినా ఇది నిజం. బ్రిటీష్ స్టాండర్డ్స్ ఇన్‌స్టిట్యూషన్ (BSI) నిర్వహించిన ఒక పెద్ద సర్వే ప్రకారం.. యువత ఇంటర్నెట్ వాడకంతో విసిగిపోతోంది. సర్వేలో భాగంగా 1,293 మంది యువ బ్రిటన్ వాసులను నిపుణులు ప్రశ్నించగా.. 47% మంది ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని ఇష్టపడతామని చెప్పినట్లు పేర్కొన్నారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. 50% మంది యువకులు సోషల్ మీడియాకు కర్ఫ్యూ (Time limit) ఉంటే తమ జీవితాలు మెరుగుపడతాయని అభిప్రాయపడ్డారు. మరో 68% మంది సోషల్ మీడియాలో టైమ్ స్పెండ్ చేశాక తమపై తమకు బ్యాడ్ ఓపీనియన్ కలుగుతోందని ఒప్పుకున్నారు.

విషయాలను దాస్తున్నారు!

ఇంటర్నెట్ వినియోగం తర్వాత యువతలో అనేకమంది తమ పేరెంట్స్ వద్ద ఆన్‌లైన్ యాక్టివిటీస్ విషయాలను దాచేస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేయడం, అపరిచితులతో లొకేషన్ షేర్ చేయడం, వ్యక్తిగత, సామాజిక సంబంధాలు కొనసాగించడం వంటివి చాలామంది చేస్తున్నారు. పూర్తిగా ఆన్‌లైన్‌లో పెరిగిన తరం ఇప్పుడు దాని నుంచి బయటపడాలని గట్టిగా కోరుకుంటున్నట్లు సర్వేను ఎనలైజ్ చేసిన నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బ్రిటన్‌లో యువతను లక్ష్యంగా చేసుకొని పనిచేసే టెక్ ప్లాట్‌ఫామ్‌లపై స్థానిక ప్రభుత్వాలు, నియంత్రణ సంస్థలపై ఒత్తిడి పెరుగుతోంది. కాగా ఇండియాలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.

ఇండియాలో పరిస్థితి..?

భారత దేశంలోని యువతలో, ముఖ్యంగా 15 నుంచి 24 ఏళ్ల వయసువారిలో ఇంటర్నెట్&సోషల్ మీడియా వినియోగం చాలా ఎక్కువగా ఉంది. ఆర్థిక సర్వే 2025-26 ప్రకారం.. డిజిటల్ అడిక్షన్ ఇండియన్ యూత్‌లో ఒక ముఖ్యమైన పబ్లిక్ హెల్త్ సమస్యగా మారుతున్నది. 2014లో 25 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఉంటే.. 2024లో దాదాపు 97 కోట్లకు పెరిగారు. ముఖ్యంగా యువత సోషల్ మీడియాను విపరీతంగా ఉపయోగించడం ఆందోళన, డిప్రెషన్, స్లీప్ డిజార్డర్స్‌ వంటి సమస్యలకు దారితీస్తున్నదని కూడా నిపుణులు చెబుతున్నారు. పలు అధ్యయనాల ప్రకారం.. కాలేజీ విద్యార్థుల్లో సుమారు 37% మంది సోషల్ మీడియా అడిక్షన్‌తో బాధపడుతున్నారు. 5-16 ఏళ్ల వయసు పిల్లలు, యువతలో 60% మంది డిజిటల్ డిపెండెన్సీ లక్షణాలను కలిగి ఉంటున్నారు. పైగా సోషల్ మీడియా అధిక వినియోగంవల్ల మానసిక ఒత్తిడి పెరగడం, సెల్ఫ్-ఎస్టీమ్ తగ్గడం, నిద్ర సమస్యలు వంటివి తలెత్తుతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

Next Story