- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళలకు మంత్రి సీతక్క కీలక పిలుపు
మహిళల ఎదుగుదలే సమాజ ప్రగతికి పునాది.. మహిళా ప్రగతే తెలంగాణ ఉన్నతి అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. 'మదర్ ఎడ్యుకేషన్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ' ఆధ్వర్యంలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 3 వేల మంది మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ పూర్తయ్యింది...

దిశ, తెలంగాణ బ్యూరో: మహిళల ఎదుగుదలే సమాజ ప్రగతికి పునాది.. మహిళా ప్రగతే తెలంగాణ ఉన్నతి అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. 'మదర్ ఎడ్యుకేషన్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ' ఆధ్వర్యంలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 3 వేల మంది మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ పూర్తయ్యింది. హైదరాబాద్‌లో బుధవారం వారికి సర్టిఫికెట్లు అందజేసే కార్యక్రమంలో మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కుట్టు మిషన్లు అందించడమే కాకుండా, సొంతంగా షాపులు ఏర్పాటు చేసుకోవడానికి రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు రుణాలు ఇస్తామని, వ్యాపారాన్ని విస్తరించుకోవాలనుకునే వారికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళా సంఘాలకు 553 బస్సులను కేటాయించామని, వాటి ద్వారా వారు నెలకు సగటున రూ.70 వేల వరకు ఆదాయం పొందుతున్నారని మంత్రి పేర్కొన్నారు. 15 ఏళ్ల నుంచి 60 ఏళ్లు దాటిన వారు కూడా మహిళా సంఘాల్లో చేరవచ్చని, వారికి సైకిల్ తొక్కడం నుంచి ఎలక్ట్రిక్ బైక్‌లు అందించే వరకు అన్ని రకాల శిక్షణలు, మద్దతు కల్పిస్తున్నట్లు మంత్రి వివరించారు.
మహిళల జోలికొస్తే ఊరుకోబోం..
"మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినా కొందరు విమర్శిస్తున్నారు. మహిళలను కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదు. వారికి తగిన సమాధానం చెబుతాం. భూదేవికి ఉన్న ఓర్పు, రాకెట్‌కు ఉన్న వేగం మహిళలకు ఉన్నాయి. మహిళలు కేవలం గృహిణులుగానే కాకుండా, ఈవెంట్ మేనేజ్‌మెంట్, జ్యువెలరీ వంటి రంగాల్లో రాణిస్తూ ఆర్థిక శక్తిగా ఎదగాలి" అని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.






