వట్‌పల్లి తహసీల్దార్‌ ఎదుట వ్యక్తి అత్మహత్యయత్నం...

by Taduka Kalyani |

తమ ఆధీనంలో సాగు చేస్తున్న వ్యవసాయ భూమిని ఇతరుల పేరిట పౌతి మార్పిడి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఓ వ్యక్తి వట్‌పల్లి తహశీల్దార్ కార్యాలయంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.

వట్‌పల్లి తహసీల్దార్‌ ఎదుట వ్యక్తి అత్మహత్యయత్నం...
X

దిశ, అందోల్/వట్‌పల్లి: తమ ఆధీనంలో సాగు చేస్తున్న వ్యవసాయ భూమిని ఇతరుల పేరిట పౌతి మార్పిడి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఓ వ్యక్తి వట్‌పల్లి తహశీల్దార్ కార్యాలయంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. కార్యాలయ సిబ్బంది సకాలంలో స్పందించి అడ్డుకోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. వివరాల్లోకి వెళ్తే.. వట్‌పల్లి శివారులోని సర్వే నంబర్ 83లో ఉన్న 9.02 ఎకరాల భూమి అనుభవదారు కాలంలో గట్‌పల్లి గ్రామానికి చెందిన మాణిక్‌రెడ్డి, విఠల్‌రెడ్డి, రాంరెడ్డిల పేర్లపై ఉండేది. దీంతో గత కొన్ని సంవత్సరాలుగా వారి కుటుంబ సభ్యులే ఆ భూమిని సాగు చేస్తున్నారు. అయితే 2016లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను ప్రవేశపెట్టడంతో అనుభవదారు కాలమ్ తొలగించబడింది. అనంతరం పట్టాదారు కాలమ్‌లో గట్‌పల్లి గ్రామానికి చెందిన బాషామియా, గూడ్‌సాబ్‌ల పేర్లు నమోదయ్యాయి. ఇటీవల వారు మరణించడంతో వారి కుటుంబ సభ్యులు తమ పేర్లపై పౌతి మార్పిడి చేసుకునేందుకు బుధవారం స్లాట్ బుక్ చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాణిక్‌రెడ్డి, విఠల్‌రెడ్డి, రాంరెడ్డి కుటుంబ సభ్యులు తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని పౌతి మార్పిడిని అడ్డుకున్నారు. తామే ఎన్నో ఏళ్లుగా భూమిని సాగు చేస్తున్నామని, తమ అనుమతి లేకుండా ఇతరుల పేరిట ఎలా మార్పిడి చేస్తారని తహశీల్దార్ జంగేశ్వర్‌ను నిలదీశారు. తమ భూమిని ఇతరుల పేరిట పట్టా మార్పిడి చేస్తే సహించబోమని హెచ్చరించారు. ఈ క్రమంలో శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించగా, కార్యాలయ సిబ్బంది వెంటనే అప్రమత్తమై అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ శ్రీహరి, పోలీసు సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని శ్రీనివాస్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. ఈ ఘటనపై తహశీల్దార్ జంగేశ్వర్ స్పందిస్తూ.. 2016లో ప్రభుత్వం అనుభవదారు కాలమ్‌ను తొలగించిన తర్వాత ధరణిలో బాషామియా, గూడ్‌సాబ్‌ల పేర్లు నమోదయ్యాయని తెలిపారు. వారు మరణించడంతో పౌతి మార్పిడికి అవకాశం ఏర్పడిందన్నారు. అయితే వివాదాస్పద అంశం కావడంతో విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, వారి సూచనల మేరకు నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అప్పటి వరకు పౌతి మార్పిడి ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు.

Next Story