ఉద్యాన ఆధారిత అంకుర పరిశ్రమలకు ఉజ్వల భవిష్యత్తు: ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి

by Kema Shiva Kumar |

2026 ఎల్ నినో నేపథ్యంలో శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన వర్సిటీ రూపొందించిన ప్రత్యేక ప్రత్యామ్నాయ పంట బులిటెన్‌ను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ. వి. బాలకిష్టారెడ్డి ఆవిష్కరించారు.

ఉద్యాన ఆధారిత అంకుర పరిశ్రమలకు ఉజ్వల భవిష్యత్తు: ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉద్యాన ఆధారిత అంకుర పరిశ్రమలకు చాలా భవిష్యత్తు ఉందని, దేశంలో ఇప్పటికీ 1,50,000 స్టార్టప్స్ ఉన్నాయని, భారతదేశం మూడో స్థానంలో ఉందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి తెలిపారు. ఆధునిక సాంకేతిక సలహాలు, సూచనలు ఉద్యాన రైతులకు సకాలంలో అందించడంలో తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ముందుందని తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ డాక్టర్ బాలకిష్టారెడ్డి అన్నారు. 2026 లో ఎల్ నినో నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో 2026-27 సంవత్సరానికి గాను ఉద్యాన పంటల్లో ప్రత్యామ్నాయ పంట యాజమాన్య పద్ధతులపై 48 పేజీల ప్రత్యేక బులిటెన్ విడుదల చేసింది శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం. ఈ బులిటెన్ విడుదల చేసిన అనంతరం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ డాక్టర్ బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు నైపుణ్యం, ఎంప్లాయిబిలిటీ పెరిగేందుకు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యాన పంటలకు రుతుపవనాలు కీలకమని, సరైన సమయంలో, సమపాళ్లలో, సరైన మోతాదులో వర్షాలు ఉంటేనే ఖరీఫ్‌లో దిగుబడులు బాగుంటాయని వర్శిటీ వీసీ డాక్టర్ డి. రాజి రెడ్డి అన్నారు.

Next Story