- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర అగ్నిప్రమాదం..10 అంతస్తుల భవనంలో చెలరేగిన మంటలు, ఐదుగురు మృతి
బెల్జియంలోని యాంట్‌వెర్ప్ నగరంలో బుధవారం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: బెల్జియంలోని యాంట్‌వెర్ప్ నగరంలో బుధవారం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లింకెరోవర్ ప్రాంతంలోని ఓ 10 అంతస్తుల నివాస భవనంలో భారీగా మంటలు చెలరేగడంతో కనీసం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ భవనంలో సుమారు 200 మందికి పైగా నివసిస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రమాదం జరిగిందిలా..?
అంతర్జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. ఉదయం 9:53 గంటల సమయంలో భవనంలోని 8వ అంతస్తులో మంటలు అంటుకున్నాయి. క్షణాల్లోనే భవనం మొత్తం దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, కారిడార్లలో పొగ నిండిపోవడంతో పలువురు నివాసితులు తమ ఫ్లాట్లలోనే ప్రాణభయంతో చిక్కుకుపోయారు.
కొనసాగుతున్న సహాయక చర్యలు
సమాచారం అందుకున్న వెంటనే వివిధ ప్రాంతాల నుంచి అగ్నిమాపక యంత్రాలు, అంబులెన్స్‌లు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. భవనంలో చిక్కుకున్న వారిని తాళ్లు, ఫైర్ నిచ్చెనల సహాయంతో సురక్షితంగా కిందకు దించారు. అగ్ని కీలల నుంచి తప్పించుకునేందుకు తాము బాల్కనీలో తలదాచుకున్నామని, అగ్నిమాపక సిబ్బంది వచ్చి తమను రక్షించారని 10వ అంతస్తులో ఉండే గెర్ట్ డెవుల్ఫ్ అనే బాధితుడు తెలిపారు.
పోలీసుల హెచ్చరికలు..
ప్రస్తుతం తమ మొదటి ప్రాధాన్యత లోపల చిక్కుకున్న వారిని రక్షించడమేనని, ఎంతమంది గాయపడ్డారనే కచ్చితమైన సంఖ్యను ఇప్పుడే చెప్పలేమని పోలీసు ప్రతినిధి కిమ్ బాస్టియన్స్ వెల్లడించారు. దట్టమైన పొగ కారణంగా ఊపిరితిత్తుల సమస్యలు రాకుండా చుట్టుపక్కల ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, కిటికీలు, తలుపులు మూసి ఉంచుకోవాలని పోలీసులు సూచించారు. ఈ దుర్ఘటనపై బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.






