మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అరెస్ట్

by Taduka Kalyani |

తెలుగు రాష్ట్రాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ గా మారిన మోస్ట్ వాంటెడ్ కరుడుగట్టిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు అత్యంత సాహసోపేతంగా అరెస్టు చేశారు.

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అరెస్ట్
X

దిశ, నల్లగొండ క్రైం: తెలుగు రాష్ట్రాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ గా మారిన మోస్ట్ వాంటెడ్ కరుడుగట్టిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు అత్యంత సాహసోపేతంగా అరెస్టు చేశారు. నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పోలీస్ జిల్లా కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిందితుడిని పట్టుకునే క్రమంలో అతడు ఇనుప రాడ్‌, కత్తితో పోలీసులపై దాడి చేయడంతో ఒక హెడ్ కానిస్టేబుల్ గాయపడగా, ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు తొలుత గాలిలో హెచ్చరిక కాల్పులు జరిపారు. అనంతరం నిందితుడి కాళ్లపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలో కొంతకాలంగా వరుస దొంగతనాలు జరుగుతుండటంతో వాటిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జిల్లా ఎస్‌పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాలతో నల్లగొండ సీసీఎస్ ఇన్‌స్ పెక్టర్ ఎం జితేందర్ రెడ్డి, మిర్యాలగూడ రూరల్ ఇన్‌స్పెక్టర్ పీఎన్డీ ప్రసాద్ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తృతంగా దర్యాప్తు నిర్వహించి, వందలాది సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించడంతో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, వరుస దొంగతనాలకు పాల్పడుతున్నది కరుడుగట్టిన పాత నేరస్థుడు భూష్మి శ్రీకాంత్ అలియాస్ అమ్మిరాజు ముఠా అని గుర్తించారు.

ఇనుప రాడ్ తో దాడి.. పోలీసుల కాల్పులు..

విశ్వసనీయ సమాచారం మేరకు జూన్ 30న ఔటర్ రింగ్ రోడ్ వద్ద పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. నిందితుడు డీసీఎం వాహనంలో నాగార్జునసాగర్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు వాహనాన్ని వెంబడించి ఆపేందుకు ప్రయత్నించారు. వాహనం ఆపిన వెంటనే నిందితుడు ఒక్కసారిగా కిందకు దూకి తన వద్ద ఉన్న ఇనుప రాడ్‌తో డ్యూటీలో ఉన్న సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్ గిరిపై దాడి చేశాడు. ఈ సందర్భంగా ఆత్మరక్షణ కోసం ముందుగా మూడు రౌండ్లు గాలిలో హెచ్చరిక కాల్పులు జరిపారు. అయినప్పటికీ నిందితుడు పోలీసులపై దాడిని కొనసాగించడంతో, ఆత్మరక్షణలో భాగంగా అతని కాళ్లపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన నిందితుడు, వనస్థలిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పోలీసులపై దాడికి సంబంధించి క్రైం నెంబర్ 532 /2026 యూ/ఎస్ 109, 121 బీఎన్ఎస్ ఆఫ్ ఆదిబట్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

అరెస్టయిన నిందితుల వివరాలు..

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం భీమవరం జిల్లా నర్సాపూర్ గ్రామానికి చెందిన భూస్మి శ్రీకాంత్ అలియాస్ అమ్మి రాజు కారు డ్రైవర్ కాగా, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం అంజనీపురం గ్రామానికి చెందిన వేల్పుల అతేంద్ర అలియాస్ అత్తిలి డీసీఎం డ్రైవర్ గా పనిచేసేవారు. వీరు ముఠాగా ఏర్పడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అనేక చోరీలకు పాల్పడినట్లు విచారణలో అంగీకరించారు. ప్రధాన నిందితుడు శ్రీకాంత్‌పై గతంలోనే 30కి పైగా కేసులు నమోదయ్యాయి. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా 40కి పైగా చోరీలకు పాల్పడినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. అతడు దొంగిలించిన సొత్తు, ఇతర సహచర నిందితుల వివరాలు ఇంకా దర్యాప్తులో వెలుగులోకి రావాల్సి ఉంది. ప్రధాన నిందితుడు పాల్గొన్న చోరీల కేసుల్లో మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 10 నేరస్థలాల్లో వేలిముద్రలు లభ్యమయ్యాయి. వాటిలో నల్లగొండ జిల్లాలో 3, ఆంధ్రప్రదేశ్‌లో 7 నేరస్థలాల్లో అతని వేలిముద్రలను పోలీసులు గుర్తించారు. ఇందులో మొత్తం నల్లగొండ జిల్లా లో 8 కేసులలో నిందితునిగా గుర్తించడం జరిగింది. కరుడుగట్టిన ఇట్టి నిందితుడిని సమర్థవంతంగా ప్రాణాలకు తెగించి పట్టుకున్న సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ జితేందర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మిర్యాల్గూడ రూరల్ ఇన్స్పెక్టర్ పీఎన్డీ ప్రసాద్ ప్రసాద్, ఎస్ఐ విజయ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధనగిరి, పుష్పగిరి, నాగరాజు, వహీద్ పాష, ఫయాజ్, పీసీ శివరాజ్, నరేష్, గులాందస్తగిరి, కమల్ కిషోర్, సాయి, జునైద్, ఆశ్రర్ లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి, వీరికి నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు ప్రకటించారు.

Next Story