‘మీరు వస్తే మేమూ సిద్ధం’.. కేటీఆర్‌కు జగ్గారెడ్డి సవాల్

by Ramesh Naini |

అయోధ్య రామ మందిరం దొంగతనం జరిగింది, భక్తులు హుండీలో వేసిన డబ్బులు దోచుకున్నారని, బీజేపీ నేతలు ప్రధాని మోడీ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు, అమిత్ షా నోరు విప్పరని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నిలదీశారు.

‘మీరు వస్తే మేమూ సిద్ధం’.. కేటీఆర్‌కు జగ్గారెడ్డి సవాల్
X

దిశ, తెలంగాణ బ్యూరో : అయోధ్య రామ మందిరం దొంగతనం జరిగింది, భక్తులు హుండీలో వేసిన డబ్బులు దోచుకున్నారని, బీజేపీ నేతలు ప్రధాని మోడీ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు, అమిత్ షా నోరు విప్పరని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నిలదీశారు. యూపీలో సీఎం కూడా బీజేపీనే కానీ, ఎవరూ ఏం మాట్లాడటం లేదని, తమ నేత రాహుల్ గాంధీ ఎంపీలను పంపించారని ఆయన తెలిపారు. బుధవారం గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రజల విశ్వాసం కోల్పోయింది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందంటే శ్రీ రాముడి వల్లనే అని, దేవుడి పేరుతో అధికారంలోకి వచ్చిన బీజేపీ, మోడీ, అమిత్ షా, యోగి పరిధిలోనే అయోధ్య ట్రస్ట్ ఉందని, ప్రధాని మోదీ ఇప్పటికైన నోరు విప్పాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. నెహ్రూ హయంలో రాముడి పాలన కొనసాగిందన్నారు. బీజేపీ చీఫ్ రామచందర్ రావు చిన్న విషయం అంటున్నారని, శ్రీరాముడి గుడిలో దొంగతనం చిన్నదా?, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే బీజేపీ నానా యాగీ చేసేదని జగ్గారెడ్డి అన్నారు. తాము మతాలను, కులాలను కలుపుతామని, బీజేపీ కులాలు, మతాలను విడదీస్తారని, ప్రధాని కనీసం క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే పోటీ

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖాళీగా ఉన్నాడని, ప్రతిపక్ష పార్టీకి ఏం పని లేదని జగ్గారెడ్డి మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం అమలు చేస్తున్నారని, మిగిలినవి అమలు చేయడానికి తిరుగుతున్నారని జగ్గారెడ్డి అన్నారు. సీఎం మీకు టైం ఇప్పుడు ఇవ్వలేరని, మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ గా వస్తే, వర్కింగ్ ప్రెసిడెంట్ గా తాను, తనతో పాటు కాంగ్రెస్ నేతలు వస్తారని సిద్ధం ఐతే చెప్పాలని కేటీఆర్ కి జగ్గారెడ్డి సవాల్ విసిరారు. ప్రతిపక్ష పార్టీగా కేటీఆర్ ఏదైనా మాట్లాడొచ్చు కానీ, ఆయన అడిగిన అన్నింటికీ సమాధానం చెప్పాల్సిన పని లేదన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే పోటీ అని, బీజేపీ పోటీలో ఉండదు అది మోడీకి కూడా తెలుసన్నారు. బీజేపీ నాయకుల్లో రోజూ భాగ్యలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్లి కొబ్బరికాయ కొడతారా? బండి సంజయ్, కిషన్ రెడ్డిలు ఎన్నికల సమయంలోనే భాగ్యలక్ష్మి గుడికి వెళ్తారని జగ్గారెడ్డి ఆరోపించారు. రోజు అమ్మవారి గుడికి పోయే ఒక్కరి పేరు చెప్పండని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ చేసిన అప్పులు కట్టే పనిలో ఉన్నారని, పథకాలు పైసలు జమ చేసే పనిలో ఉన్నారన్నారు. కేటీఆర్ ఏం మాట్లాడినా రేవంత్ రెడ్డి సీఎంనే అని జగ్గారెడ్డి అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను బీఆర్ఎస్ వాళ్ళు ఇబ్బందులు పెట్టారని, వారి హయాంలో ఆర్టీసీని అధోగతి పాలు చేసి ఇప్పుడు మాట్లాడుతున్నారని జగ్గారెడ్డి విమర్శించారు.

Next Story