- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Auto Sales: కారు అమ్మకాలలో జోష్
వినియోగదారుల కొనుగోలు శక్తి పెరగడం, వాహన రుణాలపై వడ్డీ భారం తగ్గడం కూడా మార్కెట్‌కు ఊతమిచ్చాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగి వాహనాల తయారీ వ్యయాలపై ఒత్తిడి పెరిగినా, భారత ఆటోమొబైల్ మార్కెట్ మాత్రం జూన్‌లో మెరుగైన అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది. దేశీయ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు గతేడాది ఇదే నెలతో పోలిస్తే 24.6 శాతం పెరిగి దాదాపు 4 లక్షల యూనిట్లకు చేరాయి. పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం, ఈ వృద్ధికి ఆదాయపు పన్ను రాయితీలు, రెపో రేట్ల కోతలు, జీఎస్టీ 2.0 ప్రభావం, గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన డిమాండ్ ప్రధాన కారణాలు. వినియోగదారుల కొనుగోలు శక్తి పెరగడం, వాహన రుణాలపై వడ్డీ భారం తగ్గడం కూడా మార్కెట్‌కు ఊతమిచ్చాయి.
దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి జూన్‌లో 1,47,187 యూనిట్ల దేశీయ అమ్మకాలను నమోదు చేసి 23.8 శాతం వృద్ధి సాధించింది. గ్రామీణ మార్కెట్లో మారుతీ అమ్మకాలు ఏకంగా 45 శాతం పెరగ్గా, మొత్తం అమ్మకాలలో గ్రామీణ వాటా 53.1 శాతానికి చేరింది. మరోవైపు టాటా మోటార్స్ అత్యధిక వృద్ధిని నమోదు చేస్తూ 67.4 శాతం పెరుగుదలతో 62,076 యూనిట్లు విక్రయించింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో 14,800 యూనిట్ల రికార్డు అమ్మకాలతో దాదాపు మూడు రెట్లు వృద్ధిని సాధించింది. మహీంద్రా కూడా 27.7 శాతం వృద్ధితో 60,393 యూనిట్లు విక్రయించగా, టయోటా 7.5 శాతం, కియా 19 శాతం, స్కోడా కూడా వృద్ధిని నమోదు చేశాయి. అయితే అన్ని కంపెనీల పరిస్థితి సానుకూలంగా లేదు. హ్యుండాయ్ మోటార్ ఇండియా దేశీయ అమ్మకాలు 10.6 శాతం తగ్గి 39,365 యూనిట్లకు పరిమితమయ్యాయి. రుతుపవనాల పరిస్థితి గ్రామీణ డిమాండ్‌పై ఎంత ప్రభావం చూపుతుందన్నది కూడా రాబోయే నెలల్లో కీలకంగా మారనుంది. అయినప్పటికీ ప్రస్తుతం మార్కెట్ సంకేతాలు సానుకూలంగానే ఉండటంతో, ఆటో పరిశ్రమ ఈ ఆర్థిక సంవత్సరంలోనూ వృద్ధి బాటలోనే కొనసాగుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.






