సర్కారు భూమిపై భవంతి నిర్మాణం..?

by Ratna Kumari |

నిజాంపేట్‌లో ప్రభుత్వ భూమిని తప్పుడు పత్రాల ఆధారంగా ఆక్రమించి భవంతి నిర్మాణం చేపట్టారనే ఆరోపణలు వెలువడుతున్నాయి.

సర్కారు భూమిపై భవంతి నిర్మాణం..?
X

దిశ, కుత్బుల్లాపూర్ : నిజాంపేట్‌లో ప్రభుత్వ భూమిని తప్పుడు పత్రాల ఆధారంగా ఆక్రమించి భవంతి నిర్మాణం చేపట్టారనే ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ వ్యవహారంపై పలువురు స్థానికులు బాచుపల్లి తహసీల్దార్‌కు ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టనున్నారు. వివరాల్లోకి వెళితే.. నిజాంపేట్ శ్రీనివాస్ నగర్ కాలనీ సమీపంలోని సర్వే నెంబర్ 191లో ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిలో సాయిబాబా ఆలయం, శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాలు ఉన్నాయి. వీటికి ఆనుకుని సుమారు 200 చదరపు గజాల ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్ స్థలంగా చూపిస్తూ ఓ వ్యక్తి భవంతి నిర్మాణం చేపట్టినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. సదరు భూమి బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.2 కోట్ల విలువ ఉంటుందని పేర్కొంటున్నారు. లేఅవుట్‌కు సంబంధం లేని ప్రభుత్వ భూమిని తప్పుడు డాక్యుమెంట్లతో స్వాధీనం చేసుకునే ప్రయత్నం జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తూ బాచుపల్లి తహసీల్దార్ వాణి రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై తహసీల్దార్ వాణి రెడ్డిని వివరణ కోరగా, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి అది ప్రభుత్వ భూమిగా తేలితే నిబంధనల ప్రకారం భవంతి నిర్మాణాన్ని తొలగించే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Next Story