ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) తప్పులు లేకుండా చేయాలి : కలెక్టర్

by Taduka Kalyani |

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) లో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాలలో వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ బి ఎల్ ఓ లను ఆదేశించారు.

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) తప్పులు లేకుండా చేయాలి : కలెక్టర్
X

దిశ, నల్లగొండ క్రైం: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) లో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాలలో వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ బి ఎల్ ఓ లను ఆదేశించారు. బుధవారం ఆయన నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండల కేంద్రంలో "సర్" కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి నిర్వహిస్తున్న సర్ ను ప్రత్యక్షంగా పరిశీలించారు. బిఎల్వోలు ఎన్యూమరేషన్ ఫారాలు ఓటర్లకు ఇవ్వడం, వాటిలో వివరాల నమోదు ను తనిఖీ చేశారు. 2002లో ఓటరు వివరాలున్నట్లయితే ఇప్పుడు ఎన్యుమరేషన్ ఫారంలో ఎలాంటి వివరాలు నమోదు చేస్తున్నారు.? లేనట్లయితే ఎలాంటి వివరాలు పొందుపరచాలో అడిగి తెలుసుకున్నారు.

పక్కనే ఉన్న ఇంటి యజమాని గుమ్మకొండ నర్సిరెడ్డి యాదిరెడ్డి తో మాట్లాడుతూ.. మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయని..? ఎంతమంది ఉన్నారని..? ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇచ్చారా..? వాటిని నింపారా..? ఏ పోలింగ్ కేంద్రంలో మీకు ఓట్లు ఉన్నాయి..? అని అడిగారు. ఒక కుటుంబం మొత్తం ఒక పోలింగ్ కేంద్రంలోకి వచ్చేలా చూడాలని, బిఎల్వోలు ఇల్లిల్లు సందర్శించే సమయంలోనే ఫామ్ -6, 8 వెంటబెట్టుకుని వెళ్లాలని చెప్పారు. ఒక ఓటరుకు రెండు చోట్ల ఓటు నమోదు ఉన్నట్లయితే ప్రస్తుతం తనకు ఓటు ఎక్కడ ఉండాలో ఓటరే నిర్ణయించుకోవాలని, లేనట్లయితే అధికారులే రికార్డుల ఆధారంగా ఒక చోట తొలగించడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎవరికీ రెండు చోట్ల ఓటు హక్కు ఉండరాదని తెలిపారు.

పంచాయతీ కార్యదర్శులు ఎన్యుమరేషన్ ఫారాలు నింపడంలో బిఎల్ఓ లకు సహకారం అందించాలని, ఈ విషయమై పంచాయతీ కార్యదర్శులు బిఎల్వోలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి తెలియజేయాలని ఎంపిడిఓ హిమబిందును ఆదేశించారు. ఎన్యూమరేషన్ ఫామ్స్ నింపిన తర్వాత ఓటరు జాబితా ప్రదర్శన, కొత్త ఓటు నమోదు, తప్పులను సరి చేయడం వంటివి చేపట్టడం జరుగుతుందని, అందువల్ల ఓటర్లు త్వరితగతిన వారి వివరాలను సమర్పించి ఎన్యుమరేషన్ ఫామ్స్ ప్రక్రియను పూర్తి చేసేలా సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ప్రజలతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. సర్ లో ఏమైనా సందేహాలు ఉన్నాయా..? అని అడిగారు. హైదరాబాద్ నుండి గట్టుప్పల్ కు ఓటును ట్రాన్స్ఫర్ చేసుకోవడం గురించి వారు జిల్లా కలెక్టర్ తో సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

బిఎల్ఓ లు అందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని కలెక్టర్ తహసీల్దార్ రాములు ను ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఇదే మండలం, వెలమకన్నెలో రావుల సత్యం ఇంటి వద్ద ఎన్యుమరేషన్ జరుగుతుండగా అక్కడికి వెళ్లి ఇంట్లో ఎవరెవరు ఉంటారని.? ఎంతమంది ఓటర్లు ఉన్నారని.? అందరిదీ ఒకే పోలింగ్ కేంద్రంలోనే ఓటు ఉందా.? అని అడిగారు. బిఎల్ఓ తో మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎన్ని ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చారని.? ఇచ్చిన వారందరూ తిరిగి ఇచ్చారా.? 100% ఫార్మ్స్ డిస్ట్రిబ్యూషన్ పూర్తయిందా.? ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారా.? అని అడిగి తెలుసుకున్నారు. కాగా తను అంగన్వాడీ కార్యకర్త గా పని చేస్తున్నానని తెలుపగా రెండు పనులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని, అంతే కాకుండా తప్పులు లేకుండా ఫామ్స్ నింపాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట చండూర్ ఆర్డీవో శ్రీదేవి, సర్పంచ్ ఎం .జగన్నాథం, తదితరులు ఉన్నారు .

Next Story