మైనర్ల చేతికి బైక్ ఇస్తే.. మీరూ జైలుకే...!

by Vemula.Srinu Prasad |

నడిరోడ్డు.. రద్దీగా ఉన్న ట్రాఫిక్.. ఎదురుగా పోలీసు వాహనం వస్తున్నప్పటికీ ఆ యువకుల్లో ఏమాత్రం భయం కనిపించలేదు. బండి ముందరి టైరు గాల్లోకి లేపి పోలీసుల ముందే ప్రమాదకరంగా వీలింగ్ చేస్తూ దూసుకెళ్లారు...

మైనర్ల చేతికి బైక్ ఇస్తే.. మీరూ జైలుకే...!
X

దిశ,తెలంగాణ బ్యూరో: నడిరోడ్డు.. రద్దీగా ఉన్న ట్రాఫిక్.. ఎదురుగా పోలీసు వాహనం వస్తున్నప్పటికీ ఆ యువకుల్లో ఏమాత్రం భయం కనిపించలేదు. బండి ముందరి టైరు గాల్లోకి లేపి పోలీసుల ముందే ప్రమాదకరంగా వీలింగ్ చేస్తూ దూసుకెళ్లారు. వెనుక కూర్చున్న మరో యువకుడు ఆ విన్యాసాలను మొబైల్‌లో రికార్డ్ చేస్తూ రెచ్చిపోతున్నారు. హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రధాన రహదారిపై ఇటీవల జరిగిన ఈ ఘటన చూసి ప్రయాణికులతో పాటు పోలీసులు సైతం విస్మయానికి గురయ్యారు. యువకుల నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ను గమనించిన పోలీసులు వెంటనే వారిని వెంటాడి పట్టుకున్నారు. అనంతరం డీసీపీ సమక్షంలో ఆ యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చి, గట్టిగా హెచ్చరించి వదిలిపెట్టారు. ఈ ఒక్క ఘటనే కాదు.. నగరంలో ఇలాంటి ప్రాణాంతక స్టంట్లు నిత్యకృత్యంగా మారుతున్నాయి.

లైకులు, షేర్ల కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న యువత

తాత్కాలిక వినోదం, సోషల్ మీడియాలో లైకులు, షేర్ల కోసం యువత ప్రాణాలను పణంగా పెడుతోంది. నగర శివారు ప్రాంతాలను అడ్డాగా చేసుకుని స్నేహితులతో కలిసి రేసింగ్‌లు, ట్రిపుల్ రైడింగ్‌లు, వీలింగ్‌లు చేస్తూ ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. వీరి నిర్లక్ష్యం కారణంగా అటుగా వెళ్లే అమాయక ప్రయాణికులు సైతం ప్రాణాపాయం అంచున పడుతున్నారు. యువతలో బాధ్యతా రాహిత్యం పెరిగిపోతుండటం, రోడ్డు భద్రతా నిబంధనలను గాలికొదిలేయడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

తల్లిదండ్రుల గారాబం.. పిల్లల పాలిటా మృత్యుపాశంగా..

మైనర్లు ఇలా రోడ్లపై ఇష్టారాజ్యంగా రెచ్చిపోవడానికి ప్రధాన కారణం తల్లిదండ్రుల నిర్లక్ష్యమే అని పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు. కాలేజీలకు సులభంగా వెళ్లొచ్చని, అత్యవసర పనులు త్వరగా ముగించుకుని వస్తారని చాలామంది తల్లిదండ్రులు మైనర్ల చేతికి బైక్‌లు ఇస్తున్నారు. కానీ, ఆ గారాబం పిల్లల పాలిట మృత్యుపాశంగా మారుతోందని వారు గ్రహించడం లేదు. మోటారు వాహనాల చట్టం ప్రకారం 18 ఏళ్లు నిండిన వారు మాత్రమే వాహనం నడపడానికి అర్హులు. కానీ, ఇప్పుడు కనీసం పదో తరగతి కూడా పూర్తి కాని విద్యార్థులు రోడ్లపై ఎలాంటి నియంత్రణ లేకుండా రయ్యిమంటూ దూసుకుపోతూ యాక్సిడెంట్ల బారిన పడుతున్నారు.

రూ.25 వేల జరిమానా, పదేళ్ల దాకా జైలు శిక్ష

మైనర్ల చేతికి వాహనం ఇవ్వడాన్ని చట్టరీత్యా తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్న పోలీసులు.. ఇకపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నారు. వాహనదారుల్లో మార్పు తెచ్చేందుకు అవగాహన కార్యక్రమాలతో పాటు తనిఖీలను ముమ్మరం చేశారు. పోలీసుల తనిఖీల్లో మైనర్లు పట్టుబడితే, వాహనం ఇచ్చిన యజమానికి లేదా తల్లిదండ్రులకు ఏకంగా రూ. 25,000 వరకు జరిమానా విధిస్తారు. మోటారు వాహనాల చట్టం, పోలీస్ న్యాయ సంహిత సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తే బండి యజమానికి కనీసం మూడు నెలల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని. ఒకవేళ మైనర్లు వాహనం నడుపుతూ ప్రమాదానికి గురైతే సదరు బండిని పూర్తిగా సీజ్ చేయడమే కాకుండా, ఇన్సూరెన్స్ కూడా వర్తించదని స్పష్టం చేస్తున్నారు.

బైక్ నడుపుతూ పోలీసులకు చిక్కితే....

తల్లిదండ్రుల గారాబం వల్ల క్షణికానందం కోసం బండి ఎక్కుతున్న మైనర్ల భవిష్యత్తు పూర్తిగా అంధకారంగా మారుతోంది. 18 ఏళ్లు నిండని వారు బైక్ నడుపుతూ పోలీసులకు చిక్కితే, వారికి 25 సంవత్సరాలు వచ్చేంత వరకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయరు. ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ లేదా యాక్సిడెంట్ కేసుల్లో మైనర్ల పేరు పోలీసు రికార్డుల్లోకి ఎక్కితే భవిష్యత్తులో ఆర్మీ, పోలీస్, పైలట్, యూపీఎస్సీ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడం దాదాపు అసాధ్యంగా మారుతుంది. పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ రాక పాస్‌పోర్ట్ జారీ ప్రక్రియ నిలిచిపోతుంది, విదేశీ విద్య లేదా ఉద్యోగాల కోసం వెళ్లాలనుకునేవారికి వీసాలు సైతం మంజూరు కావు అని పోలిసులు స్పష్టం చేస్తున్నారు..

మైనర్ల భవిష్యత్తు అంధకారం: రాహుల్ హెగ్డే

‘తల్లిదండ్రులు వారి తాత్కాలిక సౌలభ్యం కోసం పిల్లల చేతికి వాహనాలు ఇచ్చి వారి భవిష్యత్తును బలిచేయవద్దు. రోడ్డు భద్రతా నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించినప్పుడే ఇలాంటి అనర్థాలను అడ్డుకోగలం. మీ పిల్లలకు వాహనం తాళం ఇచ్చే ముందు.. అది వారి కెరీర్‌కు ముగింపు పలకకూడదని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.’ అని హైదరాబాద్ డీసీపీ ట్రాఫిక్, ఐపీఎస్ రాహుల్ హెగ్డే తెలిపారు.

Next Story