బాల కార్మికులు లేని ములుగు జిల్లానే లక్ష్యం

by Ratna Kumari |

ములుగు జిల్లాను బాల కార్మికులు లేని జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, బాల కార్మిక వ్యవస్థను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ హెచ్చరించారు.

బాల కార్మికులు లేని ములుగు జిల్లానే లక్ష్యం
X

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : ములుగు జిల్లాను బాల కార్మికులు లేని జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, బాల కార్మిక వ్యవస్థను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ హెచ్చరించారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించినఆపరేషన్ ముస్కాన్–XII సమన్వయ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బాల్యం ఎంతో అమూల్యమైనదని, చిన్నారులే దేశ భవిష్యత్తు అని పేర్కొన్నారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. జిల్లాలోని 80కిపైగా గుత్తికోయ ఆవాస గ్రామాల్లో పాఠశాలలకు దూరమైన (డ్రాప్‌అవుట్) పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. బాలల హక్కుల పరిరక్షణ కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. జిల్లా సంక్షేమాధికారి ఈ.పి. ప్రేమలత మాట్లాడుతూ, ఆపరేషన్ ముస్కాన్–XII కార్యక్రమాన్ని జూలై 1 నుంచి 31 వరకు సమర్థవంతంగా అమలు చేసి విజయవంతం చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి డీఎస్పీ కిషోర్, జిల్లా కార్మిక శాఖ అధికారి వినోద్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి జె. ఓంకార్, మహేందర్‌తో పాటు ములుగు, ఏటూరునాగారం పోలీసు సబ్‌డివిజన్లకు చెందిన పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Next Story