బాధితులకు అండగా ‘భరోసా’

by Batti.Sumithra |

గృహహింస, లైంగిక వేధింపులు, కుటుంబ సమస్యలతో బాధపడుతున్న మహిళలకు తక్షణ సహాయం అందించేందుకు తెలంగాణ పోలీసులు మహిళల అభివృద్ధి సాధికారిక కేంద్రాలను ఏర్పాటు చేశారని షాద్‌నగర్ డీసీపీ శిరీష అన్నారు.

బాధితులకు అండగా ‘భరోసా’
X

దిశ, షాద్‌నగర్: గృహహింస, లైంగిక వేధింపులు, కుటుంబ సమస్యలతో బాధపడుతున్న మహిళలకు తక్షణ సహాయం అందించేందుకు తెలంగాణ పోలీసులు మహిళల అభివృద్ధి సాధికారిక కేంద్రాలను ఏర్పాటు చేశారని షాద్‌నగర్ డీసీపీ శిరీష అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీడీడబ్ల్యూ భరోసా ఫ్యామిలీ కౌన్సెలింగ్ కేంద్రాన్ని బుధవారం డీసీపీ శిరీష ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ మహిళల అభివృద్ధి సాధికారిక (సీడీడబ్ల్యూ) కేంద్రాల్లో బాధితులకు చట్టపరమైన సలహాలు, మానసిక పరామర్శ, కుటుంబ కౌన్సెలింగ్‌తో పాటు అవసరమైన అన్ని సహాయ సేవలను ఒకే చోట అందిస్తామని తెలిపారు.

కేంద్రాల ముఖ్యఉద్దేశం గృహహింస బాధితులకు 100 శాతం ఉచిత, సురక్షిత కౌన్సెలింగ్ అందించడమేనని పేర్కొన్నారు. షాద్‌నగర్ జోన్ పరిధిలోని ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న బాధితులు ఎలాంటి భయాందోళనలు లేకుండా ముందుకు వచ్చి ఈ సేవలను వినియోగించుకోవాలని డీసీపీ సూచించారు. కుటుంబాలను కాపాడేందుకు, గొడవలను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు ఈ సాధికారిక కేంద్రాలు కీలకంగా ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో షాద్‌నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ, సీఐ సీతారాం, సీడీడబ్ల్యూ సెంటర్ కౌన్సెలర్ ప్రసన్న లక్ష్మి, రిసెప్షనిస్ట్ అనిత, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Next Story