Gold: మూడు నెలల్లో 14 శాతం పతనమైన బంగారం

by S Gopi |   (  Updated:2026-07-01 15:31:43  IST  )

గ్లోబల్ మార్కెట్లో ఏర్పడిన ఈ 'డెత్ క్రాస్' ప్రభావం మన దేశీయ మార్కెట్ పైనా గట్టిగా పడింది. భారతీయ కమోడిటీ మార్కెట్ (ఎంసీఎక్స్)లో ప్రస్తుతం బంగారం ధర రూ. 1,41,000 మార్కు వద్ద ట్రేడ్ అవుతోంది.

Gold: మూడు నెలల్లో 14 శాతం పతనమైన బంగారం
X

దిశ, బిజినెస్ బ్యూరో: పసిడి వైభవం క్రమంగా మసకబారుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు 2026 క్యాలెండర్ సంవత్సరం రెండో త్రైమాసికంలో ఏకంగా 14 శాతం కుప్పకూలాయి. 2013 తర్వాత గోల్డ్ మార్కెట్ ఇంత దారుణమైన త్రైమాసిక పతనాన్ని చూడటం ఇదే మొదటిసారి. ఈ ఏడాది జనవరిలో ఔన్సుకు 5,600 డాలర్ల ఆల్‌టైమ్ హై రికార్డును తాకిన ధర, ఇప్పుడు ఏకంగా 29 శాతం పడిపోయి ఔన్సుకు 3,975 డాలర్ల దిగువకు జారింది. గ్లోబల్ మార్కెట్లో ఏర్పడిన ఈ 'డెత్ క్రాస్' ప్రభావం మన దేశీయ మార్కెట్ పైనా గట్టిగా పడింది. భారతీయ కమోడిటీ మార్కెట్ (ఎంసీఎక్స్)లో ప్రస్తుతం బంగారం ధర రూ. 1,41,000 మార్కు వద్ద ట్రేడ్ అవుతోంది. గ్లోబల్ మార్కెట్లో రేట్లు దిగిరావడంతో దేశీయ ప్రధాన నగరాల్లోనూ 10 గ్రాముల బంగారం ధరలలో గత కొన్ని వారాలుగా దిగి వస్తోంది.

అమెరికాలో వడ్డీ రేట్ల భయాలు

అసలు బంగారం ధరలు ఇంతలా పడిపోవడం వెనుక అమెరికా సెంట్రల్ బ్యాంక్ 'ఫెడరల్ రిజర్వ్' కఠిన వ్యూహాలు ఉన్నాయి. అమెరికాలో వడ్డీ రేట్లను దీర్ఘకాలం పాటు అధికంగానే ఉంచవచ్చనే అంచనాలు, డాలర్ ఇండెక్స్ బలపడటం, అమెరికా-ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గడం వల్ల ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు నుంచి రూట్ మార్చారు. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు, ఎలాంటి అదనపు రాబడిని (వడ్డీ లేదా డివిడెండ్) ఇవ్వని బంగారం కంటే అమెరికా ట్రెజరీ బాండ్లలో డబ్బులు పెట్టడమే లాభసాటి అని పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. దీనివల్లే జూన్ చివరి వారంలో ఇన్వెస్టర్లు ఏకంగా 38 టన్నులకు పైగా బంగారాన్ని అమ్మేసి తమ సొమ్మును వెనక్కి తీసుకున్నారు. చైనా వంటి పెద్ద దేశాల్లో కూడా గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్లు ప్రస్తుతం మందకొడిగానే సాగుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన కొనుగోళ్లు

అయితే, గ్లోబల్ మార్కెట్లో రేట్లు పడిపోవడం మన తెలుగు రాష్ట్రాల్లోని సామాన్య కొనుగోలుదారులకు పెద్ద ప్లస్ అయింది. ధరలు భారీగా తగ్గడంతో రాబోయే శ్రావణమాసం, పెళ్లిళ్ల సీజన్ కోసం ముందే ప్లాన్ చేసుకుంటున్న ప్రజలు జ్యువెలరీ షాపులకు క్యూ కడుతున్నారు. దీంతో దేశీయంగా భౌతిక బంగారం డిమాండ్ బాగా పుంజుకుంది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన పసిడి 10 గ్రాములు రూ. 1,260 తగ్గి రూ. 1,40,780కి చేరగా, ఆభరణాల్లో వాడే 22 క్యారెట్ల పసిడి పది గ్రాములు రూ. 1,150 క్షీణించి రూ. 1,29,050గా ఉంది. వెండి కిలో రూ. 2.40 లక్షల వద్ద ఉంది.

Next Story