వెనిజులా నుంచి వచ్చిన భారతీయుడి డెడ్ బాడీలో అవయవాలు మిస్సింగ్..

by I. Sairam |

వెనిజులాలో మరణించిన భారతీయ నావికుడి మృతదేహంలో కీలక అవయవాలు మాయం అయ్యాయి. భారత్ లో నిర్వహించిన పోస్టుమార్టంలో ఈ షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి.

వెనిజులా నుంచి వచ్చిన భారతీయుడి డెడ్ బాడీలో అవయవాలు మిస్సింగ్..
X

దిశ, నేషనల్ బ్యూరో : మే నెలలో వెనిజులాలో మరణించిన భారతీయ నావికుడి మృతదేహంలో మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలతో సహా ఏ ఒక్క ముఖ్యమైన అంతర్గత అవయవాలు లేవనే దిగ్భ్రాంతికరమైన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. భారత్ లో నిర్వహించిన రెండో పోస్ట్‌మార్టంలో ఈ విషయం తేలింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని డియోరియా జిల్లాకు చెందిన రాకేష్ చౌహాన్ (33) నవంబర్‌లో ఎక్స్‌ఫినిటీ సంస్థ తరఫున మర్చంట్ నేవీ నౌకలో మెరైన్ ఫిట్టర్‌గా చేరి వెనిజులా వెళ్లారు. అయితే ఈ ఏడాది మేలో అతడు నౌకపై కింద పడి మరణించడాని తొలుత కుటుంబానికి కంపెనీ సమాచారం ఇచ్చింది. కానీ తర్వాత గుండెపోటు కారణంగా మరణించినట్లు తెలిపింది. ఈ ఏడాది జూన్ 4న అతడి మృతదేహం సొంత గ్రామానికి చేరింది. అయితే వెనిజులా అధికారులు పోస్ట్ మార్టం రిపోర్ట్‌గానీ, లేదా మరణానికి గల స్పష్టమైన కారణాలను కుటుంబానికి అందజేయలేదు. కంపెనీ తీరుపై కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో వారు జిల్లా కోర్టును ఆదేశించారు. కోర్టు ఆదేశాలతో మళ్లీ అధికారులు ఇక్కడ పోస్ట్ మార్టం నిర్వహించారు. అందులో షాకింగ్ విషయాలు తేలాయి. రాకేష్ చౌహాన్ డెడ్ బాడీలో మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు, ప్లీహం, క్లోమం, జీర్ణాశయం, ప్రేగులు, గొంతు భాగాలు వంటి ఏ ఒక్క ప్రధాన అవయవం కూడా లేదు. దీంతో అతడు అసలు ఎలా మరణించాడో ఖచ్చితమైన కారణాన్ని డాక్టర్లు కనుగొనలేకపోయారు.

కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి : ఎఫ్ఎస్‌యూఐ

రాకేష్ మరణం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఫెడరేషన్ ఆఫ్ సీఫేరర్స్ యూనియన్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్‌యూఐ), బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని, అతడి మరణం వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించేందుకు సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మృతదేహం ఉన్న పరిస్థితి పారదర్శకతపై, విదేశాలలో భారతీయ కార్మికులను చూసే విధానంపై, విదేశీ అధికారుల బాధ్యతలపై ప్రశ్నలను రేకెత్తిస్తోందని ఎఫ్ఎస్‌యూఐ పేర్కొంది. వెంటనే వెనిజులాలోని భారత రాయబార కార్యాలయం జోక్యం చేసుకోవాలని, పూర్తి శవపరీక్ష నివేదిక, మరణానికి గల పరిస్థితులను తెలియజేయాలని, కుటుంబానికి న్యాయంతో పాటు పరిహారం అందించాలని డిమాండ్ చేసింది.

Next Story